కరోనా విషాదం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోజుకి నాలుగు వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు మేకప్‌ మెన్‌ గంగాధర్‌ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మెన్‌గా పని చేసిన గంగాధర్ ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. తెలుగుతోపాటు ఆయన తమిళం, కన్నడ, బాలీవుడ్‌ హీరోలకు కూడా ఆయన మేకప్‌మెన్‌గా పనిచేశారు. 25ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ సంతాపం తెలిపారు. `నా లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేశారు. `టాటా బిర్లా మధ్యలో లైలా` సినిమా నుంచి నేను నిర్మించిన అన్ని చిత్రాలకే ఆయనే మేకప్ మెన్. ఆయనకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు కూడా వచ్చింది. నాకు ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు. తను లేడంటే నిజంగా నమ్మలేకపోతున్నా. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి` అని తెలిపారు. 

హీరో శివాజీకి కూడా పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేశారు. శివాజీతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. గంగాధర్ మరణ వార్త తెలిసిన శివాజీ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది గంగాధర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరో శ్రీ విష్ణు, పాగల్ హీరో విష్వక్ సేన్‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ నరేష్, చిత్ర యూనిట్ మొత్తం మేకప్ మెన్ గంగాధర్ మరణంపై సంతాపం ప్రకటించింది. ఇక ప్రొడ్యూసర్ యలమంచి రవిచంద్ దగ్గరుండి గంగాధర్ అంతిమ కార్యక్రమాలను జరిపించారు.