Asianet News TeluguAsianet News Telugu

30ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆదిత్య 369... టీమ్ నుండి స్పెషల్ వీడియో. సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన సింగీతం!

 'ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. తరాల తారతమ్యం లేకుండా 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది. శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరో, దర్శక-నిర్మాతలు తమ అనుభవాలు - అభిప్రాయాలను పంచుకున్నారు.

tollywood all time trend setter aditya 369 completes 30years team came up with special video ksr
Author
Hyderabad, First Published Jul 18, 2021, 11:26 AM IST

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. నేటికి (ఆదివారం - జూలై 18) 'ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. తరాల తారతమ్యం లేకుండా 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది. శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరో, దర్శక-నిర్మాతలు తమ అనుభవాలు - అభిప్రాయాలను పంచుకున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ "ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం, అజరామరం. అప్పుడు మేం చేసిన ప్రయత్నాన్ని ఆదరించి, ఇప్పటికీ చూస్తున్నారు. ఎప్పటికీ చూస్తుంటారు. ఆ సినిమా ఒక శ్రవణానందం, నయనానందం. కొన్నిటి గురించి ఎక్కువ మాట్లాడితే సూర్యుడిని వేలెత్తి చూపించినట్టు అవుతుంది. అటువంటిదే 'ఆదిత్య 369'. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయే సినిమాలు, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఆదిత్య 369'. ఒక 'పాతాళ భైరవి', 'మల్లీశ్వరి', 'దేవదాసు', 'సీతారామ కళ్యాణం', 'శ్రీకృష్ణ పాండవీయం', 'బొబ్బిలి పులి', 'కొండవీటి సింహం', 'సర్దార్ పాపారాయుడు', 'సింహా', 'లెజెండ్', 'మంగమ్మగారి మనవడు' - ఈ జాబితాలో నిలిచిపోయే సినిమా 'ఆదిత్య 369'. ఇవాళ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయ్యిందంటే చాలా సంతోషంగా ఉంది. 'అప్పుడే 30 ఏళ్లు అయ్యిందా?' అనిపిస్తుంది. మా నిర్మాత కృష్ణప్రసాద్ గారు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు, సినిమాకు పనిచేసిన మిగతావాళ్ళు అదే హుషారుతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఈ సినిమా రూపొందడంలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆయనే మా సంధానకర్త. మమ్మల్ని అందర్నీ కలిపింది ఆయనే. మొదట ఆయన, కృష్ణప్రసాద్ గారు, సింగీతం శ్రీనివాసరావుగారు వచ్చి నన్ను కలిశారు. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. ఆ పాత్రలే మమ్మల్ని ఎంచుకున్నాయి. చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలను అందరూ అనుకరించడం జరిగింది. 


చిత్రదర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఇవాళ 'ఆదిత్య 369' సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారిలో మొదటి వ్యక్తి... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఒకరోజు ఆయనను ఫ్లైట్‌లో కలిసినప్పుడు ట్రావెలింగ్ టైమ్‌లో కథ చెప్పా. ఎంతో ఎగ్జైట్ అయ్యి, ఆయన కృష్ణప్రసాద్ గారికి చెప్పారు. తర్వాత మేం బాలకృష్ణగారికి చెప్పడం, ప్రాజెక్ట్ ఓకే కావడం జరిగాయి. ఎస్పీబీగారిని ఆ రోజు నేను కలవకపోతే... ఈ సినిమా ఉండేదో? కాదో? అనేది నాకు సందేహమే. ఆయన్ను కలవడం వల్ల సినిమా మొదలైంది. అదొక దైవఘటన. రెండో వ్యక్తి... బాలకృష్ణగారు. కథ అనుకున్న తర్వాత 'శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణగారు నటిస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదు' అని కృష్ణప్రసాద్ గారు పట్టుబట్టారు. అద్భుతమైన ఆలోచన అని మేమంతా బాలకృష్ణగారి దగ్గరకు వెళ్లాం. నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ఆయన 30 సెకన్లలో ఓకే చేసేశారు. 'నాన్నగారు కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకు కూడా చాలా రోజులుగా చేయాలని ఉంది' అని బాలకృష్ణగారు చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన లేకపోతే సినిమా ఈరకంగా రాదు. మూడో వ్యక్తి... శివలెంక కృష్ణప్రసాద్. నిర్మాత లేకపోతే ఏ సినిమా ఉండదు. నేను ఎప్పుడూ ఈ మాట చెబుతా. 'ఆదిత్య 369'కి వస్తే... ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా. టైమ్  మెషీన్ సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్న సినిమాను నిర్మించడానికి కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. ఆయనకు హ్యాట్సాఫ్. ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కృష్ణప్రసాద్ గారిని నా జోహార్లు. కొత్తమ్మాయి మోహిని, ప్రొఫెసర్ గా టినో ఆనంద్, అమ్రిష్ పురి గారు, ఇవాళ హీరోగా ఉన్న అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్, అన్నపూర్ణమ్మగారు... చాలామంది ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో నటించారు. తెరవెనుక జంధ్యాలగారు మాటలు సమకూర్చగా, ఇళయరాజాగారు అందమైన సంగీతం అందించారు. ఎస్పీబీగారు, జానకిగారు పాడారు. అయితే, ముఖ్యంగా చెప్పవలసినది జిక్కీగారు పాడిన 'జాణవులే...' పాట గురించి. అద్భుతంగా ఉంటుంది. వేటూరి, వెన్నెలకంటి, సిరివెన్నెల పాటలు రాశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... పీసీ శ్రీరామ్, వీఎస్సార్ స్వామి, కబీర్ లాల్ - ముగ్గురు ఛాయాగ్రాహకులు పని చేశారు పేకేటి రంగాగారు ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం వేసిన సెట్స్ చాలా ఇంపార్టెంట్ గా నిలిచాయని చెప్పాలి. 

ఒకసారి బాలుగారి నుంచి ఫోన్ వచ్చింది. 'అర్జంటుగా విజయా గార్డెన్స్ కు రా' అన్నారు. నేను వెళ్లాను. 'రాత్రి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు పక్క సీటులో సింగీతం శ్రీనివాసరావుగారు ఉన్నారు. మంచి కథ చెప్పారు. ఒక్కసారి వారిని కలిసిరా' అని చెప్పారు. వెంటనే సింగీతంగారి దగ్గరకు వెళ్లాను. ఆయన 'కొత్త పాయింట్ తో కథ రెడీ చేశా. ఎప్పట్నుంచో నా మనసులో ఉన్నది' అని 'ఆదిత్య 369' కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ కథ. చాలా కొత్తగా అనిపించింది. 'ఇదేంటి? టైమ్ లో ట్రావెల్ అవుతారా?' అని అడిగా. 'ఇది ఫిక్షనల్ కథ. ఫాంటసీ' అని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి, ఆ తర్వాత భవిష్యత్తుకు హీరో హీరోయిన్లు ట్రావెల్ చేస్తారని, మీకు కావాలంటే రిఫరెన్స్ ఇస్తానని ఆయన రెండు మూడు వీడియో క్యాసెట్లు ఇచ్చారు. స్పీల్ బర్గ్ తీసిన 'బ్యాక్ టు ఫ్యూచర్' పార్ట్ 1,2తో పాటు 'టైమ్ ఆఫ్టర్ టైమ్' అని మరొకటి. అవన్నీ చూశా. నాకు చాలా కొత్తగా అనిపించాయి. అదే విషయం సింగీతంగారితో చెప్పాను. 'చాలా బావున్నాయి. కానీ, తీయడం సాధ్యమా?' అనే ఆశ్చర్యంలో ఉన్నాను. భారతీయ తెరపై రానటువంటి కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో చెప్పాను. ఆ తర్వాత బాలు అంకుల్ తో డిస్కస్ చేశా. 'కృష్ణా... భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా మాత్రం ఒక ల్యాండ్ మార్క్ లా నిలబడుతుంది. ముఖ్యంగా నీ సంస్థకు ఒక మైలురాయి అవుతుంది' అని మహానుభావుడు ఎస్పీబీ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో వెంటనే సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గరకు వెళ్లి 'సార్. నేను ఈ సినిమా చేస్తా' అని చెప్పాను. 'కృష్ణదేవరాయలు అంటే నందమూరి బాలకృష్ణగారు చేస్తే చాలా బావుంటుంది' అని బాలు అంకుల్ తో అన్నాను. ఆయన కూడా 'బాలకృష్ణగారు అయితే బావుంటుంది. ఆయనతో నేను మాట్లాడతాను' అని అన్నారు. మేం కాంటాక్ట్ చేయగా, బాలకృష్ణగారు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. అరగంట, 45 నిమిషాల పాటు శ్రీనివాసరావుగారు నేరేషన్ ఇచ్చారు. హీరోగారు వెంటనే ఓకే చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios