టాలీవుడ్ కురువృద్ధుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు(Kaikala Satyanaranayana Birthday). 1935 జులై 25న జన్మించిన కైకాల 87వ వసంతలోకి అడుగుపెట్టారు. కైకాల బర్త్ డే నేపథ్యంలో అభిమానులు, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కైకాలను ప్రత్యేకంగా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఆయన్ని కలిశారు. కైకాల నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయన చేత కేక్ కట్ చేయించారు. దీంతో కైకాల సంతోషం వ్యక్తం చేశారు.
పెద్దలు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన్ని స్వయంగా కలవడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను... అంటూ చిరంజీవి(Chiranjeevi) ట్వీట్ చేశారు. చిరంజీవి, కైకాల కాంబినేషన్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. చిరంజీవి చిత్రాల్లో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్ గా కూడా చేశారు. యముడికి మొగుడు, బావగారు బాగున్నారా? కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అని చెప్పాలి.
కొన్నాళ్లుగా వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కైకాల ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక లేటెస్ట్ ఫోటోస్ గమనిస్తే కైకాల బెడ్ కే పరిమితమయ్యారని తెలుస్తుంది. నటుడిగా కైకాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నారు. వందల చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామెడీ రోల్స్ చేశారు. ఎన్టీఆర్ కి కైకాల డూప్ గా చేసేవారు. యముడు పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. నవరసన నట సార్వభౌముడిగా కీర్తి గడించారు.
