బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ టైటిల్ ఉండాలి. లేకుంటే కటౌట్ తగ్గ కలెక్షన్స్ కురవవు. అందుకే దర్శక,నిర్మాతలు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూంటారు. కథ మీద ఎంత కసరత్తు చేస్తారో టైటిల్ మీద కూడా అదే స్దాయిలో చర్చలు జరిపి ఫైనల్ చేస్తారు. అదే విధంగా బాలయ్య తాజా చిత్రానికి రూలర్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. బాలయ్య, కెఎస్ రవికుమార్ కాంబోలో రూపొందే ఆ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. పవర్ ఫుల్ గా సాగే ఆ పాత్రకు తగిన టైటిల్ అదేనని టీమ్ భావిస్తోందిట. 

ఈ మేరకు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో ఇప్పటికే రిజిస్టర్ చేయించారు. ఈ చిత్రం ఈ నెల 17 ముహూర్తం జరుపుకోనుంది. ఇక ఈ టైటిల్ ని ఇంతకు ముందు బోయపాటి, బాలయ్య కాంబోలో చేసే చిత్రానికి అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య అడగటంతో కె.ఎస్ రవికుమార్ ప్రాజెక్టుకు ఇచ్చేసారని తెలుస్తోంది. 

అలాగే తన బాడీ లాంగ్వేజ్ ని, లాంగ్వేజ్ (డైలాగ్ డెలవరీ తీరు) ని అర్దం చేసుకునే టీమ్ తో హిట్  ఇవ్వటం ఈజీ కూడా. అందుకే ఓ దర్శకుడి పనితీరు, విజన్ ఒక్కసారి నచ్చితే వాళ్ళతో కంటిన్యూ అయ్యిపోతూంటారు బాలయ్య.అదే బెస్ట్ కూడా.  అందుకే సీనియర్ హీరోల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాలయ్య కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బేస్ చెక్కుచెదరలేదు. 

అలా రిపీట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ చేసిన బాలయ్య, బోయపాటిల కాంబో సినిమాలు హిట్ అయ్యాయి.  బోయపాటితో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన బాలయ్య మూడో సినిమాకు సిద్ధమవుతున్నారు.  త్వరలోనే షూట్ మొదలుకానుంది.  ఇదే తరహాలో సీనియర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలకృష్ణ.  గతేడాది వీరిద్దరూ కలిసి 'జైసింహ' చేశారు.  ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  రవికుమార్ స్టైల్ నచ్చిన బాలయ్య ఆయనతో ఇంకోసారి పనిచేసేందుకు ఒప్పుకున్నారు.  ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.