గతేడాది వచ్చిన `డీజే టిల్లు` సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు `టిల్లు స్వ్కైర్‌` రూపొందుతుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్‌ చేశారు. హీరో సిద్ధు ఈ విషయాన్ని చెప్పారు.

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి కలిసి నటించిన `డీజే టిల్లు` ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అందులోని పాటలు, డైలాగ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌. చాలా మంది మీమర్స్, ట్రోలర్స్ వాటిని వాడుతున్నారు. ఇతర సినిమాల్లోనూ కాపీ కొడుతున్నారు. అంతగా ఆ సినిమా జనాలను ఆకట్టుకుంది. 

దానికి సీక్వెల్‌గా ఇప్పుడు `టిల్లు స్వ్కైర్‌` రూపొందుతుంది. హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తుండగా, హీరోయిన్‌ మారింది. నేహా శెట్టి స్థానంలో అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నో చెప్పగా చివరికి అనుపమా ఓకే చెప్పింది. ఇటీవల విడుదల చేసిన మొదటి సాంగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచింది. 

ఇక ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ఆ ప్రకారంగానే ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. కానీ తాజాగా పెద్ద షాకిచ్చింది యూనిట్‌. సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల పోస్ట్ పోన్‌ చేస్తున్నట్టు తాజాగా హీరో సిద్దు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. 

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నాయని, ఈ సందర్భంగా అభిమానులకు క్షమాణలు తెలియజేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న విడుదల చేయలేకపోతున్నాం. ఈ వాయిదా మంచి క్వాలిటీ ఔట్‌పుట్‌ అందించేందుకు మాత్రమే. ఎలాంటి రాజీలేకుండా సినిమాని రూపొందిస్తున్నాం. మంచి ఔట్‌పుట్‌ కోసం శ్రమిస్తున్నాం. కొత్త రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తాం. మంచి విజువల్స్ తో ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి ఆతృతగా ఉన్నాం. మీ ప్రేమకి ధన్యవాదాలు` అని తెలిపారు సిద్దు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఔట్‌పుట్‌ విషయంలో సిద్దు హ్యాపీగా లేరట. ఎడిటింగ్‌ రూమ్‌లో రషెస్‌ చూసి డిజప్పాయింట్‌ అయ్యారట. దీంతో షూటింగ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడని అంటున్నారు. కొన్ని సీన్లు మళ్లీ రీ షూట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని కారణంగానే ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్, శిఖర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.