సినిమా తీయడమంటే అంత సులువైన విషయం కాదు.. 24 క్రాఫ్ట్స్ లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ సరిగ్గా వర్క్ చేయకపోయినా సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది. సినిమాపై పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించిన వారు ఇండస్ట్రీలో ఉన్నారు. అలానే నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైందట.

టైగర్ కి 11 ఏళ్ల సమయంలో ఆయన తల్లి అయేషా 'బూమ్' అనే సినిమాను నిర్మించారు. 2003లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా.. కత్రినా కైఫ్ అదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందుకు సినిమా పైరసీకి గురైంది. ఆ తరువాత సినిమా విడుదలైనా.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం డబ్బు కూడా రాలేదు. దీంతో అప్పులు తీర్చడానికి జాకీ ష్రాఫ్ ఇంట్లో సామాన్లు ఒక్కొక్కటిగా అమ్మేశేవారట. ఈ విషయాన్ని టైగర్ ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి తీసిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లో సామాన్లు అమ్మాల్సిన పరిస్థితి కలిగిందని.. దీంతో తాను వేటినైతే చూస్తూ పెరిగాడో అవన్నీ మాయమైపోతుండేవని.. చివరకు పడుకునే మంచం కూడా లేక నేలపై పడుకోవాల్సి వచ్చిందని.. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు చెప్పుకొచ్చాడు. 

2014లో 'హీరోపంతి' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు టైగర్ ష్రాఫ్. ఆ తర్వాత 'బాఘి', 'బాఘి 2' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'వార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.