మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇందులో గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ దుమ్మురేపాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట పాతిక వేలు అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. దొంగలు రైల్వేస్టేషన్‌లో దొంగతనాలకు సంబంధించిన వేలం పాట ఇది.
ఆ తర్వాత దొంగలకు కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా కావాలి అని నాజర్ దొంగలకు హితబోధ చెప్పడం, ఆ తర్వాత రవితేజ పోలీసులకు దొంగతనం జరగబోతుందని పోలీసులకు సమాచారం అందించడం, వరుసగా యాక్షన్, దొంగతనాలు, అమ్మాయిలు, బంగారు అభరణాల దొంగతనం సీన్లతో రేసీగా ట్రైలర్ సాగింది. ఇక కొట్టే ముందు, కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు అని రవితేజ చెప్పడం ఆకట్టుకుంటుంది.
ఇక హీరోయిన్‌ని ఉద్దేశించి కొలతలు బాగున్నాయి, కానీ మగజాతి మొత్తం కొలతలే చూస్తారు, కాకపోతే అనుభూతి, ఆరాధన అనే అర్థం లేని బూతులు మాట్లాడతారు` అంటూ రవితేజ చెప్పే బోల్డ్ డైలాగ్ షాకింగ్‌గా ఉంది. దీనికితోడు విలన్ల దొంగతనాలు, వారి అరాచకాలు చూపించారు. మరోవైపు రవితేజని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టగా, స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు కథ అక్కడే ముగిసింది. కానీ అక్కడే టైగర్ నాగేశ్వరరావు కథ మొదలైందని మురళీ శర్మ చెప్పే డైలాగు ఊపు తెచ్చేలా ఉంది.
టైగర్ నాగేశ్వరావుకి, ప్రధాని పర్సనల్ సెక్యూరిటీకి ఏంటీ సంబంధం అనే ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ ముగిసింది. అయితే ఇందులో రవితేజ దొంగగా, పోలీస్‌గా కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీనికితోడు రేణు దేశాయ్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ ఆద్యంతం రేసీగా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. మరి ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుదేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రమిది. దసరా కానుకగా ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది.
