`టైగర్` పేరుతో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ని తీయబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బయోపిక్ ని అనౌన్స్ చేశారు.
1970లో టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ కథ కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆయన్ని `స్టూవర్ట్ పురం దొంగ`గా పిలుచుకుంటారు. బ్యాంకులు, షాపులను కొల్లగొట్టి పోలీసులకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఆయన్ని పట్టుకోవడానికి ఓ పోలీస్ అధికారి ఏకంగా టైగర్ నాగేశ్వరరావు ప్రియురాలిని లోబరుచుకున్నాడని, అలా ఆ గజదొంగని బయటకు రప్పించి ఎన్‌కౌంటర్ చేసి చంపేశారని `టైగర్` కథ.
దీన్ని సినిమా తీసుకొచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. `టైగర్` పేరుతో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ని తీయబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. రానా ఇందులో హీరోగా నటిస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బయోపిక్ ని అనౌన్స్ చేశారు. కాకపోతే హీరో మారిపోయాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా `స్టూవర్ట్ పురం దొంగ` పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. `టైగర్` బయోపిక్ అనేది ట్యాగ్ లైన్.
ఈ చిత్రానికి కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా, బెల్లంకొండ సురేష్ తన శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు కెమెరామెన్‌గా, మణిశర్మ సంగీత దర్శకుడిగా, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని, 1970నాటి కథని చెప్పబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `ఛత్రపతి` రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
