మోహన్‌లాల్ మలయాళ చిత్రపరిశ్రమని షేక్ చేస్తున్నారు. ఆయన తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా ఆయన నటించిన `తుడరుం` సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఈమూవీ రికార్డ్ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
మలయాళ సినిమాల్లో ఇటీవల బాగా పేరు తెచ్చుకున్న సినిమా `తుడరుం`. ఈ నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షోల నుంచే ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా దాని రిజల్ట్ కనిపిస్తుంది. మోహన్‌లాల్ నటించిన `ఎంపురాన్` (ఎల్ 2ఃఎంపురాన్) సినిమా గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే.
దానికి ఉన్నంత ప్రీ-రిలీజ్ హైప్ `తుడరుం`కి లేకపోయినా, మౌత్ పబ్లిసిటీ ద్వారా బాగా పేరు తెచ్చుకుంది. తర్వాతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో ఈ సినిమా ఓ మైలురాయిని దాటింది,
విడుదలైన నాలుగో రోజుకే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. మోహన్‌లాల్‌కి ఇది నాలుగో 100 కోట్ల సినిమా. మలయాళ సినిమా చరిత్రలో 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన 11వ సినిమా ఇది.
మలయాళంలో మొదటి 100 కోట్ల సినిమా `పులిమురుగన్`, అందులో కూడా మోహన్‌లాల్ హీరో. ఆ తర్వాత `లూసిఫర్`, దాని సీక్వెల్ `ఎంపురాన్` కూడా 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. `ఎంపురాన్` జీవితకాల గ్లోబల్ గ్రాస్ 260 కోట్లు దాటింది. ఒక నెల తర్వాత మోహన్‌లాల్ మరో 100 కోట్ల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మలయాళంలో ఏ హీరోకీ దక్కని ఘనత ఇది. అంతేకాదు, వర్కింగ్ డేస్‌లో కూడా రికార్డ్ ఆక్యుపెన్సీ, భారీ కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా. అందుకే చివరి గ్రాస్ ఎంత ఉంటుందో ఇప్పుడు చెప్పలేం. ఈ సినిమాలో మోహన్‌లాల్ టాక్సీ డ్రైవర్ షణ్ముఖంగా కనిపిస్తారు.
బిను పప్పు, ఫర్హాన్ ఫాజిల్, మణియన్ పిళ్ల రాజు వంటి వాళ్లతో పాటు చాలా మంది కొత్త నటులు కూడా నటించారు. శోభన హీరోయిన్. 15 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్, షఫీక్ వి బి, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


