నేషనల్ అవార్డు నాకు అందుకే వచ్చింది... అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

పుష్ప చిత్రం అల్లు అర్జున్ ఇమేజ్ మార్చేసింది. ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంస్టాగ్రామ్ అల్లు అర్జున్ మీద స్పెషల్ వీడియో చేసింది. ఈ గౌరవం దక్కిన ఫస్ట్ ఇండియన్ హీరో అల్లు అర్జున్. అలాగే దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ మించి ఆయన నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడం విశేషం.
ఇటీవల ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సైతం నేషనల్ అవార్డు గెలుపొందారు. దీంతో అల్లు అర్జున్ శనివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. పుష్ప టీం తో పాటు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
వేదిక మీద దేవిశ్రీతో పాటు అల్లు అర్జున్ మాట్లాడారు. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''నేను చెన్నై వెళ్లిన ప్రతిసారి దేవీశ్రీని కలుస్తాను. దేవీశ్రీ నువ్వు బాలీవుడ్ కి వెళ్ళు, అక్కడ చిత్రాలు చెయ్ అని చెబుతూ ఉండేవాడిని. ముందు నువ్వు వెళ్ళు. నీతో పాటు నేను కూడా వస్తాను అనేవాడు. నేనెప్పటికి వెళ్ళాలి. అది అంత ఈజీ కాదు. వెళతానో లేదో కూడా తెలియదు నువ్వు వెళ్ళు అనేవాడిని. దేవి కోరుకున్నట్లే 20 ఏళ్ల తర్వాత పుష్ప మూవీతో ఇద్దరం బాలీవుడ్ కి వెళ్ళాము.
నేను నేషనల్ అవార్డు గెలిచానని తెలిసి మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి... ఎప్పుడూ ప్రిన్సిపాల్ దగ్గర టీసీలు తీసుకునే నువ్వు ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడం ఏంట్రా, అన్నాడు. అది గొప్ప కాంప్లిమెంట్. నేను అవార్డు గెలిస్తే నాన్న అల్లు అరవింద్ ఎంత సంతోషపడ్డారో అంతకంటే ఎక్కువ సంతోషం దేవిశ్రీకి అవార్డు రావడంతో ఆయనకు కలిగింది.
నాకు ఈ అవార్డు రావడానికి కారణం నా చుట్టూ ఉన్నవాళ్లే. వాళ్ళు కోరుకున్నారు కాబట్టే నేను అవార్డు గెలిచాను. మనం అనుకోవడం కష్ట పడటం 50 శాతం మాత్రమే. మన పక్కన ఉన్నవాళ్లు గట్టిగా కోరుకున్నప్పుడు మాత్రమే విజయాలు దక్కుతాయి. సుకుమార్ స్వార్థం లేని డైరెక్టర్. సినిమా ఫలితం, కలెక్షన్స్ ఇవన్నీ కాదు. నీలోని బెస్ట్ యాక్టింగ్ బయటకు రావాలి అన్నారు. నేను విజయం సాధించినా ఆ విషయం మాత్రం సుకుమార్ దే... అన్నారు.