వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళితో మూవీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తమ హీరో పేరిట అతిపెద్ద బ్లాక్ బస్టర్ నమోదు కావడం ఖాయం అని లెక్కలు వేసుకున్నారు. రాజమౌళి సినిమా నేపథ్యంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోతారని మురిసిపోయారు. మరి వారు ఊహించనవన్నీ జరుగుతాయో లేదో కానీ ఆర్ ఆర్ ఆర్ వలన ఎన్టీఆర్ కి భారీ గ్యాప్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ నుండి మూవీ విడుదలై రెండేళ్లు దగ్గర పడుతుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు మరో ఏడాది పట్టేలా ఉంది. అంటే దాదాపు మూడేళ్లు ఎన్టీఆర్ వెండితెరపై కనిపించడన్న మాట. 

దీనికి తోడు ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ వీడియో వస్తుందని వారు గంపెడు ఆశలు పెట్టుకోగా అదీ జరగలేదు. కొన్ని కారణాలు చూపి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వాయిదా వేశారు. ఎన్టీఆర్ మూవీపై ఎదో ఒక అప్డేట్ కావాలని వారు కోరుకుంటున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కనీసం ఈ మూవీ నుండి ఏదో ఒక అప్డేట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ 30పై అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుండగా, ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. సెంటిమెంట్ ప్రకారం షూటింగ్ మొదలు కాకుండానే మూవీ టైటిల్ ప్రకటించలేము. ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లిన వెంటనే మూవీకి సంబంధించిన డిటైల్స్ విడుదల చేస్తాం అన్నారు. కాబట్టి ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలుపెట్టే వరకు ఆ మూవీ టైటిల్ పై ఎటువంటి అప్డేట్ ఉండదు.