వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలను వెనక్కి నెడుతున్నాడు చిరంజీవి. ఏక కాలంలో మూడు నాలుగు చిత్రాలు చేస్తూ షాక్ ఇస్తున్నాడు. చిరంజీవి హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉండగా ఓ ఆసక్తికర విషయం గమనించాల్సి ఉంది.
ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని చిరంజీవి(Chiranjeevi) సిస్టర్స్ గా చేసుకున్నాడు. వారిలో ఒకరు కీర్తి సురేష్ మరొకరు నయనతార. స్టార్ హీరోయిన్స్ సిస్టర్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడో 60-70ల్లో ఈ ట్రెండ్ ఉండేది. అప్పటి హీరోయిన్స్ పాత్రలను బట్టి వేరు వేరు సినిమాల్లో ఒకే హీరోకి చెల్లులుగా, పక్కన జంటగా నటించేవారు. ఇక కమర్షియల్ చిత్రాల ట్రెండ్ వచ్చాక ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ చెల్లెలు పాత్రలు చేయడం మానేశారు. అలా చేస్తే తమ కెరీర్ కి ఎండ్ కార్డు పడుతుందని భావించేవారు.
ట్రెండు మారుతూ వస్తుండగా కీర్తి సురేష్, నయనతార(Nayanthara లాంటి స్టార్ లేడీస్ సిస్టర్స్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సైరా ఛితంలో చిరంజీవికి జంటగా నటించిన నయనతార గాడ్ ఫాదర్ మూవీలో ఆయన చెల్లెలిగా నటిస్తున్నారు. మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో చిరంజీవి చెల్లి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. దీంతో నయనతార చిరంజీవి భార్యగా, చెల్లిగా నటించినట్లు అయ్యింది.
ఫార్మ్ లో ఉన్న మరొక స్టార్ లేడీ కీర్తి సురేష్(Keerthy Suresh). ఆమె భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవిని అడిగారు. ఆమె నిరాకరించడంతో కీర్తి సురేష్ వద్దకు ఆఫర్ చేరింది. కీర్తి కాదనకుండా ఈ పాత్ర ఓకే చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సైతం రీమేక్ కావడం విశేషం. ఇది వేదాళం చిత్ర రీమేక్.
స్టార్ హీరో పక్కన చెల్లిగా కీర్తికి ఇది రెండో చిత్రం. గత ఏడాది విడుదలైన అన్నాత్తే మూవీలో రజినీకాంత్ చెల్లెలి పాత్ర కీర్తి సురేష్ చేశారు. ఇక భోళా శంకర్ మూవీలో కీర్తి రోల్ ఎలా ఉంటుందో చూడాలి. నయనతార, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెళ్లుగా కనిపించడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు చాలా వరకు షూటింగ్ జరుపుకున్నాయి. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడూ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ దసరా బరిలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
