హీరోగా, డిస్ట్రిబ్యూటర్ గా రామ్ నిండా మునిగిపోయాడు. ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికల పడిన నేపథ్యంలో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ది వారియర్ అవుట్ డేటెడ్ మాస్ సినిమా అని ప్రేక్షకులు తేల్చేశారు.  

ఏ దర్శకుడికైనా ఫార్మ్ చాలా ముఖ్యం. ట్రెండ్ కి తగ్గట్టు సినిమా తీయకపోతే ఆకట్టుకోవడం కష్టం. తమిళ దర్శకుడు లింగుస్వామి(Lingu Swami) కెరీర్ బిగినింగ్ లో మెరుపులు మెరిపించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నుండి చిత్రాలు రావడమే అరుదైపోయింది. మూడేళ్లకు నాలుగేళ్లకు తీసే ఆ సినిమాలు కూడా విజయం సాధించడం లేదు. 20 ఏళ్ల కెరీర్ లో లింగుస్వామి పట్టుమని పది సినిమాలు చేయలేదు. ఆయన గత చిత్రం పందెంకోడి 2 విడుదలై నాలుగేళ్లు అవుతుంది. అలాంటి దర్శకుడిని హీరో రామ్ పూర్తిగా నమ్మాడు. ఆ స్టోరీ ఆయనకు ఏమంత నచ్చిందో తెలియదు కానీ భారీ బడ్జెట్ తో బైలింగ్వల్ మూవీ చేయడానికి సిద్దమయ్యాడు. 

తీరా విడుదలయ్యాక తెలిసింది, జరిగిన డామేజ్ ఏమిటో. రామ్(Ram Pothineni) డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఓకే చేశావ్ అన్నయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బలం లేని కథ తీసుకొని ఓ ఇరవైఏళ్ళ క్రితం మాస్ చిత్రాల ఫార్ములాలో తెరకెక్కించాడు. ఏమాత్రం ఆసక్తి రేపని కథనం ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. ఇక ఫస్ట్ షో నుండే ది వారియర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్ డే పర్వాలేదు అనిపించిన ది వారియర్ రెండో రోజు నుండే చతికల పడింది. దానికి తోడు టికెట్స్ ధరలు, వరదలు సినిమా వసూళ్లను దెబ్బతీశాయి. 

గురువారం విడుదలైన ది వారియర్ లాంగ్ వీకెండ్ దక్కించుకొని కూడా రికవరీకి దగ్గర కాలేకపోయింది. నాలుగు రోజుల్లో ఏపీ/తెలంగాణాలో కలిపి కేవలం రూ. 15.5 కోట్ల షేర్ అందుకుంది. వీకెండ్ ముగిసేనాటికి 48 శాతం మాత్రమే బిజినెస్ చేసింది. ఈ క్రమంలో ది వారియర్ రన్ ముగిసే నాటికి పది కోట్లకు పైగా నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా రూ. 13 కోట్లకు ది వారియర్ మూవీని నైజాంలో రూ. 4 కోట్లకు వైజాగ్ లో రామ్ సొంతగా విడుదల చేశారు. 

నాలుగు రోజులకు నైజాంలో ది వారియర్(The Warriorr) కి వచ్చింది దాదాపు రూ. 5 కోట్లు మాత్రమే. ఇక వైజాగ్ లో రూ. 2 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. నేపథ్యంలో రామ్, స్రవంతి మూవీస్ ది వారియర్ తో భారీగా నష్టాలు చవిచూడనున్నాయి. ఓవర్ సీస్ లో కూడా ది వారియర్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. దాదాపు రూ. 2 కోట్ల బిజినెస్ చేసిన ది వారియర్ రూ. 80 లక్షలకు దగ్గరైంది. మొత్తంగా రామ్ ది వారియర్ మూవీఫై పెట్టుకున్న అసలు గల్లంతు అయ్యాయి. ఈ మూవీలో రామ్ కి జంటగా కృతి శెట్టి నటించగా, దేవిశ్రీ సంగీతం అందించారు.