‘మీర్జాపూర్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. అప్డేట్ ఇచ్చిన యూనిట్.!
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘మీర్జాపూర్’ (Mirzapur) రెండు సీజన్లతో హిట్ సిరీస్ గా నిలిచిన విషయం తెలిసిందే. సీజన్ 3 గురించి ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ అప్డేట్ అందించారు.

ఓటీటీ ప్లాట్ ఫాంలో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న హిందీ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. రెండేండ్ల కింద ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యధిక వ్యూయర్ షిప్ ను దక్కించుకున్న సిరీస్ గా పలు అవార్డులను కూడా అందుకుంది. ఈ సిరీస్ లో మాఫియా డాన్ గా పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi), అతని భార్య బీనా త్రిపాఠిగా రసిక దుగల్, కొడుకు మున్నాగా దివ్యేందు, గ్యాంగ్‌స్టర్ గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్ (Ali Fazal), గజ్‌గామిని గుప్తా అకా గోలుగా శ్వేతా త్రిపాఠి శర్మ నటించారు. ఈ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ క్రైమ్ డ్రామాను ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ తమ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రూపొందించారు.
రెండు సీజన్లతో ఆడియెన్స్ ను మెప్పించిన చిత్ర యూనిట్ మూడో సీజన్ ను కూడా తీసుకొస్తున్న ప్రకటించారు. అన్న, చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపి పగ సాధిస్తాడు. అక్కడితో రెండో సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత అఖండానంద్, గుడ్డు పండిట్ మధ్య ఏం జరిగిందనేని మూడో సీజన్ తో తెలియాల్సి ఉంది. దీంతో ప్రేక్షకులు ‘మీర్జాపూర్ సీజన్ 3’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నటుడు అలీ ఫజల్ ఓ క్రేజీ పోస్ట్ తో ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అందించారు.
అలీ ఫజల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మీర్జాపూర్ సీజన్ 3పై అప్డేట్ అందించారు. సీజన్ 3 షూటింగ్ పూర్తైందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ నోట్ ను రాశారు. ‘మీర్జాపూర్ కోసం చిత్ర యూనిట్ చేస్తున్న కృషికి చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. గత రెండు సీజన్ల మాదిరిగానే సీజన్ 3 కూడా నాకు భిన్నమైన అనూభూతిని కలిగించింది. సెట్స్ లోనూ చిత్ర యూనిట్ బాగా సహకరించడం మరిచిపోలేను. సీజన్ 3లోనూ అందరూ చక్కగా నటించారు. మీ అందరిపై మాటల్లో చెప్పలేని ప్రేమ ఉంది. చివరగా, అమెజాన్, ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్, దర్శకుడు గురుకు ధన్యవాదాలు’ అని పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.