నటి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లిని జీర్ణించుకోలేని ది కట్ అనే పత్రికప్రియాంక చోప్రాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వీరి పెళ్లిపై బురద చల్లారు.

ప్రియాంకకి ఉన్న ఫాలోయింగ్, బాలీవుడ్ లో ఆమె పాపులారిటీ అలానే అమెరికాలో ఆమె సంపాదించుకున్న పేరు ఇవేవీ లెక్క చేయకుండా ఆమెని తక్కువ చేస్తూ దారుణంగా ఓ వార్తను ప్రచురించారు. నిక్ జొనాస్ సరదాగా.. కొన్ని రోజులు ప్రియాంకతో గడుపుదామని భావించి ఉంటాడని కానీ ప్రియాంక తన ట్రిక్ లతో అతడిని వలలో వేసుకొని పెళ్లి కూడా చేసుకుందని ఆమెని తప్పుడు మాటలతో దూషించారు.

ఒక అమెరికన్ భారతీయ స్త్రీని వివాహం చేసుకోవడంతో అక్కడి మీడియా ఇలాంటి వార్తలు ప్రచురించి రేసిజంని ప్రోత్సహిస్తుందని ప్రియాంక అభిమానులు మండిపడుతున్నారు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న జంటపై ఈ రకమైన వార్తలు ప్రచురిస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 

దీంతో సదరు పత్రిక ఆ వార్త తీసేసి క్షమాపణలు చెప్పారు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా లేరు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.