‘‘ఈతరంలో అలాంటి నటి ఇంకొకరు లేరు.. ఉండరు’’ అతిలోక సుందరి శ్రీదేవి గురించి అత్యధికులు చెప్పే మాట ఇది. ఎవరూ కాదనలేని నిజం కూడా ఇది. తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ ఇలా ఎన్నో భాషల్లో నటించినా అందరినీ మెప్పించి వెండితెరపై రాణిలా వెలిగిన శ్రీదేవి ఇప్పుడు ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయింది. దుబాయ్ లో బంధువుల వివాహ వేడుకకు వెళ్లిన ఆమె అటునుంచి అటే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం అందరనీ కలచివేసింది. 

శ్రీదేవి చివరగా మామ్ సినిమాలో వెండితెరపై కనిపించింది.  ఇదికాక షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జీరో సినిమాలో ఓ కామియో రోల్ చేసింది. ఇదొక్కటే ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా లిమిటెడ్ గానే సినిమాలూ చేసుకుంటూ వచ్చిన శ్రీదేవి ఆమధ్య ఓ యాడ్ లో కూడా నటించింది. స్నీకీ ఓట్స్ యాడ్ లో ఆమె కూల్ మామ్ గా కనిపించింది. స్కూలుకెళ్లే వయసులో ఇద్దరు పిల్లలతో ఆడుతూ.. పాడుతూ వారిని నవ్వించి వారి ఆకలి తీర్చే తల్లి పాత్రలో శ్రీదేవి నటించింది. అంతకు ముందు టీవీల్లో కూడా పెద్దగా కనిపించని ఈ యాడ్ శ్రీదేవి హఠాన్మరణంతో ఇప్పుడు ఈ యాడ్ ఒక్కసారిగా పాపులర్ అయింది. 

దాదాపు రెండు నిమిషాల వ్యవధి ఉండే ఈ యాడ్ శ్రీదేవి ఎంత గొప్ప నటో మనకు మరొక్కసారి గుర్తు చేస్తుంది. ఆ అందమైన చిరునవ్వు.. చలాకీతనం.. ప్రేక్షకులకు కట్టిపడేస్తాయి. ఈ యాడ్ రెండు నిమషాల పాటూ కళ్లార్పకుండా చూశాక.. చివరిలో శ్రీదేవి ఇకలేదని తెలిసి కంటిచివర నిలిచిన నీటిని తుడుచుకున్నామంటే అది కచ్చితంగా శ్రీదేవి గొప్పతనం తప్ప మరొకటి కాదు.