త్వరలోనే ధళపతి విజయ్ తనయుడు హీరోగా పరిచయం అవుతారనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. లైకాలో దర్శకుడిగా సినిమా చేస్తున్నారు.
దళపతి విజయ్.. కోలీవుడ్ నాట తిరుగులేని స్టార్‌గా ఉన్నారు. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, ఇమేజ్ ఉన్న హీరో. త్వరలో `లియో` చిత్రంతో రాబోతున్నారు. అయితే త్వరలోనే విజయ్ తనయుడు హీరోగా పరిచయం అవుతారనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. విజయ్ తనయుడు జానస్ సంజయ్ విజయ్ ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏకంగా భారీ చిత్రాల ప్రొడక్షన్ హౌజ్ లైకాలో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. జాసన్ సంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నట్టు లైకా సోమవారం ప్రకటించింది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ , తమ బ్యానర్‌లో విజయ్ తనయుడు జాసన్‌సంజయ్ విజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అతను ను చెప్పిన యూనిక్ పాయింట్ నచ్చిందని, తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ డైరెక్ట్ చేయబోతున్నామన్నారు. `సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (హానర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్ తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు` అని చెప్పాడు.
డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ , లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు` అన్నాడు విజయ్ తనయుడు.
జాసన్ సంజయ్ విజయ్ టోరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు. అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారు. అయితే హీరోల తమకుమారులను కూడా హీరోలుగా పరిచయం చేయాలనుకుంటారు. తమ లెగసీని, తమ నట వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటారు. కానీ విజయ్ తనయుడు దర్శకుడిగా పరిచయం కావడం ఆశ్చర్యపరుస్తుంది.
