దళపతి విజయ్‌.. సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారట. కోలీవుడ్‌ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. 

దళపతి విజయ్‌.. కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఉన్నారు. ఇమేజ్‌ పరంగా, ఫ్యాన్‌ బేస్‌ పరంగా తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ ఎలాగో, కోలీవుడ్‌ విజయ్‌ అలాగ. అక్కడ రజనీ, కమల్‌ వంటి సీనియర్లని పక్కన పెడితే విజయ్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌ అని చెప్పొచ్చు. తాజాగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని, ఆయన సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్త వినిపిస్తుంది. విజయ్‌ 2016 ఎలక్షన్లే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారని సమాచారం. 

విజయ్‌ శనివారం చెన్నైలో పెద్ద ఈవెంట్‌ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ ని అభినందించారు. పతి ఒక్కటి టాపర్‌కి 5వేల చెప్పున ఆయన ఏకంగా 70లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలంతా.. డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని పేరెంట్స్ కి చెప్పాలని, అంబేద్కర్‌, పేరియార్‌ వంటి గొప్ప వారి గురించి తెలుసుకోవాలని వెల్లడించారు. డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతిని మార్చాలని పిలుపునిచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి. 

అయితే విజయ్‌ ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి వెళ్లడమనే విషయాన్ని కన్ఫమ్‌ చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ముందస్తు ప్లాన్‌తోనే విజయ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టెంన్త్, ఇంటర్‌ పూర్తయిన వాళ్లు వచ్చే ఎన్నికలకు ఓటు హక్కుకి అర్హులవుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా వారందరిని తనకి అనుకూలంగా మార్చుకునేందుకు వీలవుతుందని, ఆ సమయంలో ఇప్పటి విద్యార్థులంతా తనకు ప్రయారిటీ ఇస్తారనే ఉద్దేశ్యంతోనే విజయ్‌ ఈ కార్యక్రమం చేపట్టినట్టు టాక్‌. ఈ లెక్కన విజయ్‌ యువతరాన్ని, విద్యార్థులను టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇక విజయ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో `లియో` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ఈ సినిమా రాబోతుంది. అనంతరం `విజయ్‌68` ఫిల్మ్ గా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇటీవలే దీన్ని ప్రకటించారు. ఇదే విజయ్‌ చివరి చిత్రం కాబోతుందని సమాచారం. వచ్చే ఏడాది వరకు ఈ సినిమాని కంప్లీట్‌ చేసి ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారట విజయ్‌. మరి ఇందులో నిజమెంతా? విజయ్‌ వ్యూహమేంటి? అనేది తెలియాల్సి ఉంది.