తమిళ నటుడు, కమెడీయన్‌ వివేక్‌ కుటుంబాన్ని దళపతి విజయ్‌ పరామర్శించారు. వివేక్‌ హఠాన్మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో వారిని విజయ్‌ ఓదార్శారు. వివేక్‌ ఈ నెల 17న కన్నుమూశారు. ఆ సమయంలో విజయ్‌ ఇండియాలో లేరు. తన సినిమా షూటింగ్‌ నిమిత్తం జార్జియాలో ఉన్నారు. దీంతో వివేక్‌ని కడసారి చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకి తిరిగి వచ్చిన విజయం సోమవారం వివేక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యాన్నిచ్చారు. 

విజయ్‌, వివేక్‌ కలిసి అనేక సినిమాల్లో నటించారు. విజయ్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి చాలా సినిమాల్లో వివేక్‌ని హాస్యనటుడిగా తీసుకున్నారు. ఇటీవల వచ్చిన `విజిల్‌` చిత్రంలోనూ వివేక్‌ నటించి ఆకట్టుకున్నారు. అంతకు ముందు `కురువి`(తెలుగులో దోపిడి), `ఉదయ`, `ఆతి`(ఇది కళ్యాణ్‌ రామ్‌ నటించిన `అతనొక్కడే`కి రీమేక్‌), `తిరుమలై` వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. వివేక్‌తో తనకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో విజయ్‌ ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.

తనదైన నటనతో, కామెడీతో నవ్వులు పూయించిన వివేక్‌ ఇటీవల `విజిల్‌` తోపాటు `దారాల ప్రభు` చిత్రంలో కనిపించారు. `అరణ్మనై 3`, `ఇండియన్‌ 2`, వంటి చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక విజయ్‌ ఈ ఏడాది సంక్రాంతికి `మాస్టర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ప్రస్తుతం నెల్సన్‌ దిలిప్‌ కుమార్‌ దర్శకత్వంలో తన 65వ చిత్రంలో నటిస్తున్నారు.