మంగళవారం చిరంజీవిని కలిసి షూటింగ్‌ల బంద్‌కి సంబంధించిన సమస్యని వివరించారు నిర్మాతలు. తాజాగా బాలయ్యని కలవడం విశేషం. ఈ సమస్య ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది.
KNOW
తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్‌ల బంద్ వ్యవహారం ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుంది. సినీ కార్మికులకు, నిర్మాతలకు చర్చలు విఫలం కావడంతో సినీ కార్మికులు షూటింగ్‌ల బంద్‌కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులకు తీసుకొచ్చి షూటింగ్‌లు జరిపించారు. దీన్ని స్థానిక ఫెడరేషన్ నాయకులు, కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గొడవలు కూడా జరిగాయి.
గొడవలకు దారితీసిన షూటింగ్‌ల బంద్ వ్యవహారం
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న ప్రభాస్ మూవీ `ది రాజాసాబ్` మూవీ సెట్ డ్యామేజ్ అయ్యింది. దీనిపై కోర్ట్ నుంచి నోటీసులు పంపించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ సమయంలో నిర్మాత చెర్రీతో కార్మికులకు గొడవలు జరిగాయి. అదే సమయంలో సారథి స్టూడియోలో సీరియల్ షూటింగ్‌ని కాస్ట్యూమర్స్ యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. ఇందులో కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడి చేశారు యూనియన్ కార్యదర్శి నరసింహరావు. ఆయనపై కేసు నమోదైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య చిరంజీవి వద్దకు వెళ్లింది.
చిరంజీవిని కలిసి సమస్య వివరించిన నిర్మాతలు
మంగళవారం నిర్మాతలు సుప్రియ, రవిశంకర్, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్ వంటి వారు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. సమస్యని వివరించారు. ఆయన ఈ బంద్‌పై విచారం వ్యక్తంచేసినట్టు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. అదే సమయంలో కార్మికులతోనూ మాట్లాడతానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చిరంజీవి చెప్పినట్టు సి కళ్యాణ్ వెల్లడించారు.
బాలయ్య వద్దకు వెళ్లిన నిర్మాతలు..
ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాత బాలయ్యని కలవడం విశేషం. ప్రసాద్ ల్యాబ్లో `అఖండ 2` సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనుల్లో ఉన్నారు బాలకృష్ణ. ఈ విషయం తెలుసుకుని ఆయన్ని నిర్మాతలు బుధవారం కలిశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపీనాథ్ ఆచంట, దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ వంటి నిర్మాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిస్థితిని ఆయనకు వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్స్ ని, యాక్టీవ్ ప్రొడ్యూర్స్ గిల్డ్ నిర్ణయాలు ఆయనకు తెలియజేశారు.
ప్రతి హీరో ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలని వెల్లడి
ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ, ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేయాలని, తాను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తానని చెప్పారు. నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్మికులు కూడా పరిశ్రమలో బాగామే అని, త్వరలో సమస్యలు తొలగిపోతాయి అని బాలకృష్ణ చెప్పడం విశేషం. కానీ అసలు సమస్యకు పరిష్కారం రాలేదు. బంద్ ఇంకా కొనసాగుతుంది. మరి దీనిపై ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపిస్తారో చూడాలి.
