Asianet News TeluguAsianet News Telugu

విషాదంః కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎస్‌. చంద్రశేఖర్‌ కరోనాతో కన్నుమూశారు. ఆల్‌ ఇండియా రేడియో సంగీత దర్శకుడిగా పాపులరైన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్ర్భాంతికి గురి చేసింది. 

telugu music director k s chandra shekar passed away due to corona  arj
Author
Hyderabad, First Published May 12, 2021, 2:47 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎస్‌. చంద్రశేఖర్‌ కరోనాతో కన్నుమూశారు. ఆల్‌ ఇండియా రేడియో సంగీత దర్శకుడిగా పాపులరైన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇటీవల వరుసగా సినీ ప్రముఖులు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌. చంద్రశేఖర్‌ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్తను సినీ రంగంలో కొనసాగుతున్న మేనల్లుడు మహేంద్ర తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువరు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కె.ఎస్‌.చంద్రశేఖర్‌ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. వీరికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. 

1990లో అల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. అల్లురామలింగయ్య చిత్రం `బంట్రోతు భార్య`తో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన సంగీత దర్శకులు చక్రవర్తివద్ద 70 కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్ గా చేశారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేసి గీత ఆర్ట్స్ బ్యానర్ పై   మెగాస్టార్ చిరంజీవి హీరోగా అల్లు అరవింద్  నిర్మించిన  `యమకింకరుడు` చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ కోవలో రజనీకాంత్‌ తొలి చిత్రం `బ్రహ్మముడి`, భానుచందర్ `హంతకుడి వేట`, రాజేంద్ర ప్రసాద్ `ఆణిముత్యం` కోడి రామకృష్ణ గారి `ఉదయం`, `అదిగో అల్లదిగో`, దాసరి `భోళాశంకరుడు`,  `ఆత్మ బంధువులు`, `కంచి కామాక్షి` ( తమిళ్ & హిందీ ) ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు.

ఆ తర్వాత విశాఖపట్నం  అల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలందిస్తూ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఘంటసాల తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి తన హార్మోనియం బహుమతిగా ఇస్తే అది ఎంతో భద్రంగా అపురూపంగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అతిధులకు దానినే ముందుగా చూపించేవారు. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు ఈయన దగ్గర శిష్యరికం చేయడం విశేషం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తానొక వెటర్నటీ డాక్టర్ అయినా తన కిష్టమైన రంగంలో పి హెచ్ డి ని పూర్తి చేసిన నిత్య విద్యార్థి. తన జీవితంలో దాసరి చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios