బాహుబలి సినిమాతో ఖండాంతరాలు దాటిన రాజమౌళి ఖ్యాతి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సంచలనం అయితే ఓ తెలుగు హీరో.. బాహుబలి ఎవరు తీశారు అని నికిషాను అడిగాడట
తెలుగు సినీ పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళి తెలియని హీరోలున్నారా.. ఉన్నారా అంటే... ఉన్నారనే అంటోంది ఓ హీరోయిన్. పవన్ కళ్యాణ్ సరసన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా నటించిన నికిషా పటేల్ గుర్తుందిగా.. రీసెంట్ గా సాయి రామ్ శంకర్ తో.. అరకు రోడ్ లో సినిమాతో మెరిసింది. ఈ నటీమణి ఇటీవలే ఓ హీరోను బాహుబలి చూశావా.. అని అడిగితే.. ఎవరి సినిమా అది అనడిగాట్ట.
అసలు ‘బాహుబలి’తో రాజమౌళి పేరు ఒక్క తెలుగులో ఏం ఖర్మ... తమిళ, మలయాళం, హిందీ ప్రాంతాలతో పాటు దేశవిదేశాల్లో మారుమోగి పోతోంది. అలాంటిది ఆయన పేరు, ‘బాహుబలి’కి దర్శకుడు ఆయనే అనేది ఓ తెలుగు నటుడికి తెలీదంటే ఆశ్చర్యమే. కానీ, నికిషా పటేల్ ఏదో గాలి మాటల్లా కాకుండా సీరియస్ గా తన ట్విటర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. మరి తన మాటలను నమ్మక తప్పుతుందా.
నికిషా పటేల్.. ఓ తెలుగు నటుణ్ణి ‘బాహుబలి’ చూశావా? అని అడిగితే... ‘‘దానికి దర్శకుడు ఎవరు? ఎవరు దర్శకత్వం వహించారు?’’ అని సదరు నటుడు ఎదురు ప్రశ్నించాడట. ‘‘అతడు అంత నిర్లక్ష్యంగా, మూర్ఖంగా ఎలా ఉన్నాడో! అతణ్ణి చూస్తే అసహ్యంగా ఉంది. అలా ప్రవర్తించినందుకు ఆ హీరో సిగ్గుపడాల్సిన విషయం’’ అని నికిషా ట్వీట్ చేసింది. ఆ నటుడు ఎవరంటారు? అది మాత్రం చెప్పనంటే చెప్పనంటోంది నికిషా.
