అన్నపూర్ణ స్టూడియో భూమిపై టీ సర్కారు కన్ను

First Published 18, Nov 2017, 10:01 AM IST
telangana govt seeking annapurna studio land for road widening
Highlights
  • అన్నపూర్ణ స్టూడియో నుంచి అరెకరం భూమి అఢిగిన టీ సర్కారు
  • రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నాగార్జునతో చర్చలు
  • నాగార్జున అంగీకరించినా, మరింత భూమి అడుగుతుండటంతో సమస్య
  • స్వయంగా రంగంలోకి దిగి నాగార్జునను ఒప్పించేందుకు మంత్రి కేటీఆర్ ప్లాన్

హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి మెట్రో ప్రాజెక్టులో భాగంగా రోడ్ కోసం కొంత భూమిని సేక‌రించ‌నున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. స్టూడియో నుంచి 20 అడుగుల మేర రోడ్డుకు కేటాయించేందుకు కింగ్ నాగార్జున అంగీక‌రించార‌ని, ఆ మేర‌కు తెరాస‌ ప్ర‌భుత్వంతో ఒప్పందం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో.. అంటే దాదాపు రెండేళ్ల క్రితం ప్ర‌చార‌మైంది. రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా ఈ అంగీకారం కుదిరింద‌ని చెప్పుకున్నారు. బంజారాహిల్స్ నుంచి కృష్ణానగర్, జవహర్ నగర్, అన్నపూర్ణ స్టూడియోస్ మీదుగా యూసఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పెట్ వెళ్లే వాహనదారుల సమస్యలని తగ్గించేందుకు రోడ్డు విస్త‌ర‌ణ చేపట్టింది ప్ర‌భుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ ఆనుకుని ఉన్న‌ రోడ్డు మార్గం వెడ‌ల్పు చేస్తున్నారు. ఇప్పటికే 20 అడుగుల మేర అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టేందుకు అక్కినేని కుటుంబం అంగీకరించింది. దీంతో నలభై ఫీట్లను 60 ఫీట్ల రోడ్డుగా మార్చారు.

 

అయితే మినిమం 80 ఫీట్ల రోడ్ వేయ‌నిదే ప్ర‌మాదాల్ని నిలువ‌రించ‌లేమ‌ని ఇంజినీర్లు తేల్చి చెప్ప‌డంతో మ‌రో 20 అడుగుల మేర అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి తలెత్తిందిట‌. దీంతో స్థానిక నాయ‌కులు ప్రత్యేక చొరవ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యంతో చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు కోత పడనుంది కాబ‌ట్టి.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగి నాగార్జున‌తో మంత‌నాలు సాగించ‌నున్నార‌ట‌. 80 అడుగుల రోడ్డు కోసం అన్నపూర్ణ స్టూడియోలో 40 అడుగుల స్థ‌లాన్ని సేక‌రిస్తార‌ని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ రోడ్డు మార్గాన్ని రూ 8 కోట్ల వ్యయంతో చేపడుతోంది.

 

1975లో నామమాత్రపు ధరకు దానిని ప్రభుత్వం ఇచ్చినందున పరిహారం ఇవ్వవలసిన అవసరం లేదని కొందరు చెబుతున్నారని తెలుస్తోంది. అయితే, హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం దానిని ఇచ్చారని, దాని కోసమే ఉపయోగించామని యాజమాన్యం చెబుతోంది. అన్నపూర్ణ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సుప్రియ మాత్రం... రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి తాము భూమి ఇచ్చేందుకు వ్యతిరేకం కాదని, అయితే తమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పరస్పరం అంగీకారం కుదురుతుందో, లేక మరింత సమయం పడుతుందో తెలియదు కానీ నాగార్జునతో మంత్రి కేటీఆర్ మాట్లాడితే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

loader