నెలల తరబడి సాగిన కరోనా పరిస్థితుల నుండి దాదాపు బయటపడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా నిబంధలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలు తిరిగి ప్రారంభం కావడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐతే జనసమర్ధం అధికంగా ఉండి,కరోనా వ్యాప్తికి ఆస్కారం ఉన్న సినిమా థియేటర్స్ లో మాత్రం భౌతిక దూరం ఉండేలా 50శాతం సీటింగ్ కి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. సినిమా థియేటర్స్ లో కేవలం 50శాతం టికెట్స్ మాత్రమే విక్రయించి, సీటుకు సీటుకు మధ్య అంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ నిబంధలను తెలుగు రాష్ట్రాలలోని అన్నీ థియేటర్స్ పాటిస్తున్నాయి. 

అయితే తెలంగాణా ప్రభుత్వం సినీ ప్రియులకు, థియేటర్స్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది. పూర్తి సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడుపుకొనేలా 100శాతం సీటింగ్ కెపాసిటీని అనుమతిస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. 


 తెలంగాణాలో థియేటర్స్ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవచ్చని  ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం సూచించిన భద్రతా నియమాలు పాటించడం తప్పనిసరి అంటూ ఆదేశించడం జరిగింది. కేంద్రం ఇప్పటికే వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వగా, ఆయా రాష్ట్రాలు పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైన నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం దీనిని అమలులోకి తెచ్చింది.