తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అద్భుతమైన పాటని స్వరపరిచారు. `పోలీస్‌.. పోలీస్‌.. తెలంగాణా పోలీస్‌.. ప్రాణం పంచే మనసున్న పోలీస్‌.. ` అంటూ సాగే పాటని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణితోపాటు సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఉమేష్‌ ష్రాఫ్‌, జితేందర్‌, సందీప్‌ శాండిల్య, శివధర్‌ రెడ్డి, నాగిరెడ్డి, బాలనాగాదేవి, వెంకటేశ్వర్లు, పాట ఎడిటర్‌ హైమా రెడ్డి పాల్గొన్నారు. 

ఈ పాటని గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రచించడం విశేషం. ఈ నెల 21 నుంచి నేడు(శనివారం) వరకు నిర్వహించిన పోలీస్‌ ప్లాడ్‌ డే కార్యక్రమాల సందర్భంగా ఈ పాటని విడుదల చేయడం సందర్భోచితంగా ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవాలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించాని అన్నారు. మనం కష్టపడుతూ సేవలందిస్తుంటూ మనతో ఎంతో మంది కలిసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు. 

`మాతృదేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఆ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను సంగీత దర్శకుడు కీరవాణి ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయసులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్‌ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలిపారు. ఇస్తున్న ప్రాణం మీ కోసం అనే పోలీస్‌ త్యాగాలను తెలియజేసే పాటను 1998లో అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరిచి పాడానని చెప్పారు. ఈ పాటని హిందీలో కూడా కంపోజ్‌ చేస్తానని కీరవాణి తెలియజేశారు.