‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

తెలుగు హారర్ కామెడీలు ఎంత బోర్ వచ్చేసాయంటే...ఆ జానర్ లో ఓ సినిమా వస్తోందంటే..గుర్తు పెట్టుకుని మరీ ఎవాయిడ్ చేసేస్తున్నారు.ఎందుకంటే దెయ్యాలు నవ్వించటం మానేసి నవ్వులు పాలు అయ్యిపోతున్నాయి. 

taxiwala movie telugu review

---సూర్య ప్రకాష్ జోశ్యుల

తెలుగు హారర్ కామెడీలు ఎంత బోర్ వచ్చేసాయంటే...ఆ జానర్ లో ఓ సినిమా వస్తోందంటే..గుర్తు పెట్టుకుని మరీ ఎవాయిడ్ చేసేస్తున్నారు.ఎందుకంటే దెయ్యాలు నవ్వించటం మానేసి నవ్వులు పాలు అయ్యిపోతున్నాయి. అయితే ప్రతీ దానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ సినిమాకు మినహాయింపు..విజయ్ దేవరకొండే. విజయ్ ఓకే చేసాడంటే విషయం ఉండకుండా చేయడనే నమ్మకం ఉంది. అంతవరకూ బాగానే ఉంది. అనుకోని అవాంతరం ఈ సినిమాకు పైరసీ రూపంలో వచ్చింది. రిలీజ్ కు ముందే టోరెంట్ సైట్స్ లో దర్శనమిచ్చింది. 

సినిమా పబ్లిసిటీ కన్నా ఈ పైరసీ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. తెలియనివాళ్లు కూడా ఈ సినిమా పైరసీ దొరుకుతుందంట కదా అని ఉత్సాహపడే సిట్యువేషన్ తెచ్చారు. దాంతో  చాలా మంది ఇప్పటికే చూసేసే ఉంటారు. ఖచ్చితంగా ఆ మేరకు ప్రభావం కలెక్షన్స్ పై పడుతుంది. ఈ నేపధ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమా కు హిట్ టాక్ వస్తేనే నిలబడుతుంది. లేకపోతే ఆ పైరసీ లింక్ భయ్యా అని వాట్సప్ లో కుర్రాళ్లు మెసేజ్ లు పెట్టుకుంటారు.  ఇంత క్లిష్టమైన పరిస్దితుల్లో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది. అసలు కథేంటి...హర్రర్ కామెడీ నవ్వించిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..

కథేంటి..

శివ (విజయ్‌ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ కార్ల రిపేరింగ్ షెడ్ పెట్టుకున్న తన స్నేహితుడు(మధు నందన్‌)  ని కలిసి ఉద్యోగ ప్రయత్నం చేసి పిజ్జా డెలివరీ బోయ్ గా జాయిన్ అవుతాడు. అయితే ఆ వర్క్ కష్టం కొద్ది రోజులుకే తెలిసివస్తుంది. జాబ్ చూడరా అంటే నాచేత జిమ్నాస్టిక్స్ చేయిస్తార్రా అని ఫ్రెండ్ ని తిట్టిపోస్తాడు. ఈ లోగా సిటీలో క్రేజీగా మారిన క్యాబ్ డ్రైవర్ ప్రొఫిషన్ గురించి తెలుస్తోంది. 

దాని గురించి ఫ్రెండ్ కూడా పాజిటివ్ గా చెప్తాడు. క్యాబ్ డ్రైవర్స్ నెలకు లక్ష సంపాదించచ్చా ..ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్ వీడు..అంటూ ఆవేశపడిపోతాడు.  సాప్ట్ వేర్ వాళ్లకన్నా క్యాబ్ డ్రైవర్సే ఎక్కువ సంపాదిస్తారని,  క్యాబ్ లో తిరిగే వాళ్లకన్నా..క్యాబ్ డ్రైవర్సే హ్యాపీగా ఉన్నారు అని మరింతగా చెప్పటంతో ఉత్సాహపడి..టాక్సీవాలాగా మారదామని ఫిక్స్ అయ్యిపోతాడు. 

అయితే సొంత క్యాబ్ కొనుక్కోవటానికి డబ్బు లేకపోవటంతో తన వదిన (కళ్యాణి) బంగారం అమ్మి,అన్న దాచుకున్న డబ్బులు కలిపి వచ్చిన లక్షా అరవై తొమ్మిది వేలతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొందామని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో సెకండ్ హ్యాండ్ కార్ల బ్రోకర్ చిత్రం శ్రీను ని కలుస్తాడు. అతని దగ్గర ఓ దెయ్యం కారు ఉంటుంది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. బకరాగా ..శివ కనపడతాడు. వెంటనే అంటగట్టి వదిలించుకుంటాడు. తక్కువ రేటుకు వస్తోంది కదా శివ ..ఆ దెయ్యం కారుని కొనుక్కుని తమ కష్టాలు తీర్చే దేవుడులా దణ్ణం పెడతాడు. అక్కడ నుంచి టాక్సీ రైడ్స్ మొదలువుతాయి. 

టాక్సీ ఫస్ట్ రైడ్‌లోనే అను (ప్రియాంక జ‌వాల్క‌ర్‌) అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇక జీవితం సాఫీగా వెళ్లిపోతుంది  అనుకున్న  ఆ టాక్సీలో దెయ్యం ఉందని శివకు రివీల్ అవుతుంది.  ఆ కారు కొన్నప్పటి నుంచి ఎప్పుడూ  కడగకపోయినా.. అద్దంలా మెరుస్తూనే ఉంటుంది. కారులో ఎఫ్ ఎమ్ స్టేషన్స్ అన్నీ అవే మారుతూంటాయి.  డోర్ విండోలు అవే క్లోజ్ అవుతూంటాయి. ఎసి వెయ్యకపోయినా చల్లగా ఉంటుంది. 

ఈ విషయం స్నేహితుడుకి చెప్తే వాళ్లు నవ్వేసి అవన్నీ రిపేర్లు అని కొట్టి పారేస్తారు. కారులో దెయ్యాలు షికారు అనే టైటిల్ తో సినిమా కూడా తీస్తామని వెటకారం చేస్తారు. కారెక్కితే ఠా..దెయ్యాల ముఠా, కారు..డ్రైవర్..ఓ దెయ్యం, కార్లో దెయ్యం నాకేం భయం, దెయ్యం కారులో హర్రర్ సినిమా  అంటూ సినిమా టైటిల్స్ కూడా చెప్తారు. కానీ అతి త్వరలోనే వాళ్లకూ అందులో ఓ దెయ్యం ఉందనే విషయం అనుభవంలోకి వస్తుంది.   దాంతో కారును వ‌దిలించుకోవాల‌ని శివ ప్ర‌య‌త్నిస్తాడు. కానీ అది అత‌న్ని విడిచిపెట్ట‌దు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో ఆ కారు ఓ మర్డర్ కూడా చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా భయపడిపోతాడు శివ. 

ఇలాంటి సిట్యువేషన్ లో  శివ ఏం చేసాడు..నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..?  ఈ టాక్సి మ్యాటర్ కు  అను (ప్రియాంక జవాల్కర్‌), శిశిర (మాళవిక నాయర్‌)లకు ఉన్న రిలేషన్  ఏంటి..? అన్నదే మిగతా కథ.

taxiwala movie telugu review

ఎలా ఉంది..

హర్రర్ కామెడీలు ఎప్పుడూ కిక్ ఇచ్చే సరుకే. అందులోనూ విజయ్ దేవరకొండ వంటి హీరో చేస్తే ఆ లెక్కే వేరు. అయితే ఇక్కడో చిక్కు ఉంది..హర్రర్..కామెడీ రెండు విడివిడిగా పండాలి..కలిసి కదం తొక్కాలి..భయపడుతూనే నవ్వాలి..నవ్వుతూనే టెన్షన్ పడాలి.. ఇలా కలిసిమెలిసి ఈ రెండు జానర్స్ వర్కవుట్ అయితేనే చూసేవారికి, తీసినవారికి గిట్టుబాటు.  ఈ సినిమాలో భయం కన్నా ఎక్కువ ఫన్ పండింది. నవ్వుకుందాం అని సినిమాకు వెళ్లేవారికి సినిమా బాగుందనిపిస్తుంది. 

ఇక ఇలాంటి కథలు ..పూర్తిగా స్క్రీన్ ప్లే మీదా, రాసుకున్న సీన్స్ ఎగ్జిక్యూషన్ మీదా ఆధారపడతాయి. స్టోరీ లైన్ గా కొత్తగా అనిపించని ఈ సినిమాని  చాలా వరకూ సిట్యువేషన్ కామెడీ తో  దర్శకుడు లాక్కెళ్లే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వంటి ఆర్టిస్ట్ ..కామెడీ సెన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే చాలా డైలాగులు న్యాచురల్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ..విజయ్ దేవరకొండ కాకుండా వేరే చేస్తే చాలా కష్టమనిపించేది. కమిడియన్ మ‌ధునంద‌న్‌, హాలీవుడ్ (విష్ణు) అనే క్యారెక్ట‌ర్ చేసిన కుర్రాడి పాత్ర‌లు చేసే కామెడీ చాలా బాగుంది. 

హైలెట్స్..

ఫస్టాఫ్ లో మధునందన్ ,హాలీవుడ్ కలిసి..కారులో దెయ్యం ఉందని నమ్మక..అందులో తాగుతూ హారర్ సినిమా చూసే పోగ్రాం పెట్టుకుంటారు. అప్పుడు అందులో ఉన్న దెయ్యం వాళ్లతో ఆడుకుంటుంది. ఆ ఎపిసోడ్ సూపర్బ్ గా పేలింది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కూడా అసలు ఎక్సపెక్ట్ చేయం. సెకండాఫ్ లో మార్చురీ సీన్ చాలా బాగా డిజైన్ చేసారు. దెయ్యం గతం తెలుసుకోవటానికి విజయ్ పడే తిప్పలు కూడా నవ్విస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంది. 

taxiwala movie telugu review

మైనస్ లు..

ఫస్టాఫ్ లో ఉన్నంత ఫన్ సెకండాఫ్ లో తగ్గిపోయింది. గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. సెకండాఫ్ ని మరింత షార్ప్ గా  ఉంటే బాగుండేది. లాగిన ఫీలింగ్ వచ్చింది. అలాగే దెయ్యం గతం మనని మెప్పించదు. 

టెక్నికల్ గా..

ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ చాలా వరకూ న్యాయం చేసారనే చెప్పాలి. కామెడీ సీన్స్ ని ఎక్కడా తడబడకుండా తెరకెక్కించి నవ్వించాడు. భయపెట్టడమే కాస్తంత కరువైంది. ఇక కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలు సోసోగా ఉన్నాయి. హాలు నుంచి బయటకు వచ్చాక గుర్తు పెట్టుకునేలా లేవు. 

ఫైనల్ ధాట్
 
సినిమాని పైరసీ చేయగలిగారు కానీ క్రియేటివిటిని  చేయలేరు కదా..దాని విలువ దానిదే..దాని గెలుపుదానిదే..

రేటింగ్: 3/5 

నిర్మాణ సంస్థ‌లు: జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేషన్స్‌
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, మాళ‌వికా నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, సిజ్జు, ఉత్తేజ్‌, యమున‌, క‌ల్యాణి, ర‌విప్ర‌కాశ్, ర‌వివ‌ర్మ‌ త‌దిత‌రులు
సంగీతం: జేక్స్ బిజాయ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సుజిత్ సారంగ్‌
కూర్పు: శ్రీజిత్ సారంగ్‌
స్క్రీన్‌ప్లే, మాట‌లు: సాయికుమార్ రెడ్డి
నిర్మాత‌: ఎస్‌.కె.ఎన్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్‌

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios