వాళ్లు పదే పదే బాధ పెట్టారు... తారకరత్న మరణించిన నెల రోజులకు భార్య సంచలన పోస్ట్
తారకరత్న మరణించి నెల రోజులు గడుస్తుండగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి, ఆపై ఇబ్బందులు వంటి విషయాలు ప్రస్తావించారు.

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. కార్దియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన తారకరత్న సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నారు. ఆయన కోలుకుని తిరిగి వస్తారని అభిమానులు భావించారు. దురదృష్టవశాత్తు తారకరత్న అందరినీ వదిలిపోయారు. తారకరత్న మరణం భార్య అలేఖ్య రెడ్డిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. తారకరత్న మరణించి మార్చి 18వ తేదీకి నెల రోజులు గడిచింది. ఈ క్రమంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ప్రస్తావించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎదురైన కష్టాలు వివరించారు. అయిన వాళ్ళే పలు మార్లు బాధపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. 'మన పరిచయం ప్రేమగా మారింది. నా మనసులో ఎక్కడో ఒక సందిగ్దత ఉండేది. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళావు. మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులపాలు చేసింది.
కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. అయినవాళ్లే పదే పదే మనల్ని బాధపెట్టారు. కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. పిల్లలు పుట్టాక మన జీవితం మారిపోయింది. సంతోషం నిండింది. నువ్వు రియల్ హీరో. మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను...' అని తన భావోద్వేగం బయటపెట్టారు. మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ద్వారా తారకరత్న నిరాధరణకు గురయ్యాడని, తల్లిదండ్రులు దూరం పెట్టి వేదనకు గురి చేశారని ఆమె చెప్పకనే చెప్పారు. అంత పెద్ద నందమూరి వంశంలో తారకరత్న ఒంటరి అయ్యాడని ఆమె చెప్పినట్లు ఉంది. తారకరత్నతో అలేఖ్య రెడ్డికి రెండో వివాహం. ఆయన హీరోగా తెరకెక్కిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. 2012లో అలేఖ్య రెడ్డిని తారకరత్న గుడిలో వివాహం చేసుకున్నారు. మిత్రుల మధ్య నిరాడంబరంగా తారకరత్న వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.