Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ కన్నా టాలీవుడ్ సినిమాలే ఎక్కువ వసూళ్లు చేస్తాయి-తాప్సీ

  • ఇప్పుడంతా తెలుగు సినిమాలదే హవా అంటున్న తాప్సీ
  • బాలీవుడ్ సినిమాలు సైతం తెలుగు సినిమాల్లా ఆడట్లేదు-తాప్సి పన్ను
  • మీడియా నా గురించి  ఎక్కువగా పట్టించుకోవడం సంతోషాన్నిస్తోందంటున్న తాప్సి
tapsi interview about anando brahma and other film topics

సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ తాజాగా నటించిన చిత్రం ఆనందో బ్రహ్మ. ఈ చిత్రం కథ విని కేవలం 5 నిమిషాల్లో ఓకే చెప్పానంటోంది తాప్సి. ఇలాంటి కొత్త దనం వున్న కథలను ఎంచుకోవడం తనకు సంతృప్తినిస్తుందని తాప్సీ అంటోంది. మరి దెయ్యాన్ని ఎలా భయపెట్టొచ్చో చెప్పే ఈ హారర్ కామెడీ చిత్రంలో తాప్సీ పాత్ర ఏంటి.. తన భవిష్యత్ ప్రాజెక్టులు, ఇతర విశేషాల గురించి తాప్సీ ఏమంటోంది చూద్దాం.

 

ప్రశ్న: దర్శకుడు మహీ కథ ఎందుకు ఒప్పుకున్నారు...

మహికి దెయ్యం, దేవుడిపై నమ్మకం లేదు. సహజంగా మనిషి ఊహకు అంతం లేదు. మనం గత కొన్ని తరతరాలుగా దెయ్యం ఇలా వుంటుందంటూ.. దానికి కొన్ని లక్షణాలు అంటగట్టి.. ఆ రూపానికి భయపడుతున్నాం. అయితే.. తొలిసారిగా అసలు దెయ్యాన్ని ఎలా భయపెట్టొచ్చు. దెయ్యం అంటే మనందరికీ భయం వుండటంలో లాజిక్ లేదు. కానీ ఫస్ట్ టైమ్.. దానికే భయం కల్పిస్తూ సినిమాలో వెరైటీగా చూపించడం కొత్త అనుభవం. ఈ సినిమా పూర్తయ్యాక ఆనందో బ్రహ్మ అనే పేరు పెట్టాం. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఆనందం పంచుతుంది. అందుకే నేను దక్షిణాదిలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమోషన్ ఏ సినిమాకు చేయకున్నా... దీనికి మాత్రం  చాలా ప్రమోషన్ వర్క్ చేశా. స్క్రిప్ట్ నా దగ్గరికి రాగానే నేను ఎక్కువ ఆలోచించకుండా కథ నచ్చటంతో ఓకే చెప్పాను.

 

ప్రశ్న: బాలీవుడ్, టాలీవుడ్ లలో పని చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ మూవీలో కేరక్టర్ ఎలా వుంటుంది...

బాలీవుడ్ లో 90 శాతం భాషపై పట్టున్నందున.. నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ వుంటుంది. కానీ దక్షిణాదిలో భాష ప్రాబ్లెం కాబట్టి దర్శకునికే వదిలేస్తా. ఎలాగైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వుంటే మేనేజ్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు. ఆనందో బ్రహ్మ సినిమాకు సంబంధించి అంతా కొత్తగా వుండాలని ప్రతీదీ కొత్తగా ప్లాన్ చేశాం. పోస్టర్, టీజర్, ట్రైలర్,ఇలా ప్రతీదీ.. వెరైటీగా ప్లాన్ చేశాం. కొత్తదనం వుంటేనే జనం ఇటువైపు చూస్తారు. నా కేరక్టర్ కొత్తదేం కాదు. కాకుంటే తెరకెక్కించిన తీరు ప్రత్యేకమైనది. ఈ కథ నాకు నచ్చటం వల్లే చేశాను. ఘాజీలో కూడా నేను చిన్న కేరక్టర్ చేశాను. కానీ దేశమంతా గర్వించదగ్గ సినిమా అది. అందుకే చేశాను. నేను ప్రేక్షకుల డబ్బులకు విలువనిచ్చి కేరక్టర్స్ ఎంచుకుంటా. స్టార్ లా ఫీలవను. నాకు స్క్రిప్ట్ నచ్చింది. అందుకే ఈ సినిమా చేశా. ఈ సినిమాలో కేరక్టర్స్ చేసిన వాళ్లంతా.. డిజెబిలిటటీస్ తో వున్నారు. కానీ వాళ్ల డిసెబిలిటీస్ వల్ల...సినిమాలో వాళ్లు హీరోలయ్యారు.

ప్రశ్న: గ్లామర్ పాత్రలకు తాప్సీ దూరమైందన్న వార్తలపై మీరేమంటారు..

గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ప్రేక్షకుడి డబ్బుకు వేల్యూ వుండాలి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు దర్శకుడు మహికి.. మంచేంటో చెడేంటో తెలుసు. తను చాలా హానెస్ట్. ముందు తన గురించి తాను క్రిటిసైజ్ చేసుకున్నాక ఇతరుల్లో లోపాలు వెతుకుతాడు. అలాంటి కేరక్టర్ అరుదుగా కనిపిస్తుంది. నా బాలీవుడ్ మూవీ చూశాక..  మీతో నేను సరిగ్గా పర్ఫామెన్స్ తీసుకోలేదని చెప్పాడు. నిజాయితీగా మాట్లాడతాడు. మీరన్నట్లుగా ఏమీ లేదు. గ్లామర్ పాత్రలకు నా అవసరం అనిపిస్తే, ఎవరైనా అడిగితే, నచ్చితే ఖచ్చితంగా చేస్తాను.

 

ప్రశ్న: పింక్ సినిమా తర్వాత మీలో ఎలాంటి మార్పు వచ్చింది...

పింక్ తర్వాత.. నేను నాపై నమ్మకం కలిగింది. మీడియా నా గురించి రాయాలనుకోవడం, నేనేం చేస్తున్నా వెంటపడటం నాపై కొత్త అటెన్షన్ తీసుకొచ్చింది. ప్రతీ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. నేను జనం కోరుకున్న సినిమాలు చేశాను, మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసినా... మూడేళ్ల తర్వాత నాకు నచ్చిన సినిమాలు చేసే అవకాశం దక్కింది. మనం ఎన్ని సినిమాలు చేస్తున్నాం. ఎంత పెద్ద సినిమాలు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం. అనే విషయాలు పక్కనబెట్టి.. గత మూడేళ్లుగా జీవితంలో చాలా సంతోషంగా వున్నాను. రాత్రే బిగ్ బాస్ సెట్ నుంచి వచ్చాను. హ్యాపీగా వున్నాను. ఇలాగే కొంత కాలం వుండాలన్నది నా కోరిక.

 

ప్రశ్న: బాలీవుడ్ లో మీ సక్సెస్ రేటు పెద్దగా లేదనే విమర్శలున్నాయి.. వాటిపై..

సినిమా సక్సెస్ ను అంచనా వేయడంలో చాలా మంది విఫలమవుతున్నారు. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నేను నటించిన నామ్ షబానా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. అసలు బాలీవుడ్ కన్నా ఎక్కువ బిజినెస్ టాలీవుడ్ లో అవుతుంది. బాలీవుడ్ ఏం టాలీవుడ్ కన్నా పెద్దది కాదు. చాలా బాలీవుడ్ సినిమాలను టీవీలో వచ్చినపప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు తప్ప జనం ఒకే రకమైన సినిమాలు చూడాలనుకోవట్లేదు. షారుఖ్, సల్మాన్ ల సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేదు. కానీ... ఎందుకో వర్కవుట్ కావట్లేదు. మరి ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.

ప్రశ్న: తెలుగులో ఆనందో బ్రహ్మ తర్వాత మళ్లీ ఎప్పుడు వస్తున్నారు..

నాకు టాలీవుడ్ ఆఫర్లు చాలా వచ్చాయి. వాటిలో పెద్ద కమర్షియల్ సినిమాలేం లేవు కానీ నాకు నచ్చిన కథలు ఇక బాలీవుడ్ లో కూడా నేను వెరైటీ కథలు ఎంచుకున్నా. తెలుగులో కూడా వెరైటీ కథలు చేయాలని వుంది. నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేకున్నా స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని కోరిక వుంది. క్రికెట్, ఫుట్ బాల్ లాంటివే కాక ఇతర క్రీడలు కూడా చూస్తాను. కెరియర్ లో ఎదగాలి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవట్లేదు. ఒకవేళ చేసుకున్నా.. నటన ఆపను. శ్రీదేవిలా టాప్ పొజిషన్ లో వుండాలి. ఈ వయసులో కూడా శ్రీదేవి అంటే ఎంతత క్రేజ్ వుందో చూస్తునే వున్నాం కదా.. అలాంటి వాళ్లలా వుండాలి. నిజానికి ఐదేళ్ల క్రితం నేను సినిమాలు మానేయాలనుకునేదాన్ని. కానీ... ఇప్పుడు ఆలోచన మారింది. నటన మానేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఫిట్ నెస్ కోసం పెద్దగా వర్కవుట్స్ చేయను కానీ స్క్వాష్ ఆడుతాను.

 

ప్రశ్న: సోషల్ మీడియా వల్ల లాభమా నష్టమా...

సోషల్ మీడియాల వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. నాలాంటి సెలెబ్రిటీ జీవితంలో ట్రోల్ సహజం. అయితే ట్రోల్ చేస్తున్నారని భయపడిపోయే రోజులు పోయాయి. నా సోషల్ మీడియా ఎకౌంట్స్ నేనే హాండిల్ చేస్తా. కొన్నిసార్లు నన్ను ఎబ్యూస్ చేస్తుంటారు. దాని గురించి పెద్దగా బాధపడను. అలాంటి వాళ్లను బ్లాక్ చేస్తా. అయితే.. ఈ మధ్య కాలంలో బ్లాక్ చేయడం కూడా మానేశా. ప్రతి వాడూ ట్రోల్ చేస్తుంటే బ్లాక్ చేయటానికి టైం సరిపోవట్లేదు. అలాంటి వాళ్లు ఎక్కడైనా వుంటారు. వాళ్ల గురించి ఆలోచిస్తూ కూర్చోలేం కదా.. మన దారిన మనం ముందుకు పోతుండాలి.. అంటూ ముగించింది.

Follow Us:
Download App:
  • android
  • ios