వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి విమర్శించిన వారికి నటి తనుశ్రీ దత్తా ఘాటుగా సమాధానమిచ్చారు.  ఫుడ్‌కి సంబంధించిన ఫ్రీడమ్‌ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

DID YOU
KNOW
?
`మీటూ` ఉద్యమానికి పునాది
నటి తను శ్రీ దత్తా గతంలో`మీటూ` ఉద్యమానికి తెరలేపారు. నానా పటేకర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలపై ఆమె లైంగిక ఆరోపణలు చేసి దుమారం రేపారు.

బాలకృష్ణతో `వీరభద్ర`లో హీరోయిన్‌గా నటించి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన తను శ్రీ దత్తా ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు చెప్పి షాకిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకోగా వైరల్‌ అయ్యింది. ఇందులో ఆమె ఏడుస్తూ కనిపించారు

ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు తనుశ్రీ దత్తా. తన ఆహారపు అలవాట్ల గురించి విమర్శించిన వారికి సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానమిచ్చి మళ్ళీ చర్చనీయాంశమయ్యారు. మాంసాహారం తీసుకున్నందుకు ట్రోల్ చేసిన వారిని ఖండించారు. ఇలాంటి విమర్శలు 'చిన్నబుచ్చే మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తాయని అన్నారు.

ఇంతకీ ఏం జరిగింది?

తనుశ్రీ దత్తా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాంసాహారం తీసుకుంటున్న ఫోటో షేర్ చేశారు. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ఆమె ఆహారపు అలవాట్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు. 

ముఖ్యంగా ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు, ఆధ్యాత్మిక భావాలు కలిగినవారు కాబట్టి మాంసాహారం తినడం తప్పు అని కామెంట్లు చేశారు. ఈ విమర్శలు వ్యక్తిగత దూషణలకు దిగజారడంతో తనుశ్రీ దత్తా మౌనం వీడి కౌంటర్ ఇచ్చారు.

ట్రోలర్స్ కి తనుశ్రీ దత్తా ఘాటుగా కౌంటర్‌

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెద్ద నోట్ రాస్తూ, ట్రోలర్స్ అజ్ఞానాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని తనుశ్రీ దత్తా తీవ్రంగా ఖండించారు. "కొంతమంది అవమానించే, చులకనగా చూస్తూ, తీర్పు చెప్పే జనాలకి ఒక మాట. నేను బెంగాలీ బ్రాహ్మణురాలిని. 

మా సంస్కృతిలో చేపలు, మాంసం దేవతలకి నైవేద్యంగా పెడతాం. ముఖ్యంగా దుర్గాపూజ, కాళీపూజ సమయాల్లో ఇది మా సంప్రదాయంలో భాగం" అని స్పష్టం చేశారు.

నేను గొడ్డు మాంసం, పంది మాంసం తినను. కానీ చేపలు, మాంసం తినడం నా వ్యక్తిగత ఇష్టం. నా కృష్ణ భక్తికి, నా ఆహారపు అలవాట్లకి సంబంధం లేదు. భగవంతుడు ప్రేమ, భక్తి చూస్తాడే తప్ప ఎవరు ఏం తింటారో చూడడు. ప్రతి ఒక్కరి సంస్కృతి, నేపథ్యం వేరు. అందరినీ ఒకే గాటిన కట్టడం మూర్ఖత్వం" అని రాశారు.

`మీ పని మీరు చూసుకోండి` అంటూ ట్రోలర్లకు సలహా

"ఇలాంటి నెగెటివ్, తీర్పు చెప్పే మనస్తత్వం ఉన్నవాళ్ళు తమ జీవితాల గురించి ఆలోచిస్తే మంచిది. ఇతరుల జీవితాల్లో తొంగి చూడకుండా, తమ ఆధ్యాత్మికత, జీవితాలు మెరుగుపరుచుకోవాలి. నన్ను ట్రోల్ చేస్తే నేను ఊరుకుంటానని అనుకోకండి. నా జీవితం నా ఇష్టం, నిజాయితీగా బతుకుతా" అని సవాల్ విసిరారు.

మొత్తానికి, తనుశ్రీ దత్తా పోస్ట్ వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆహార స్వాతంత్య్రం, సాంస్కృతిక వైవిధ్యం గురించి చర్చను లేవనెత్తింది. ఆన్‌లైన్‌లో అనవసరంగా ఇతరులను విమర్శించే వారికి ఆమె సమాధానం తగిన కౌంటర్ అని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.