నాగబాబు, రాఘవేంద్రరావులపై మరోసారి విరుచుకుపడ్డారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. మీకు సిగ్గు ఉండాలంటూ, మీ లెక్కలన్నీ తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ వైపు `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక్క రోజే టైముంది. అక్కడ ఉత్కంఠ నెలకొంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం `ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్` వివాదం దుమారం రేపుతుంది. ఒకరికొకరు కౌంటర్లివ్వడం పెద్ద రచ్చ అవుతుంది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్‌ఆర్‌ఆర్`పై చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. తమ్మారెడ్డికి నాగబాబు, రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు, నెటిజన్లు కౌంటర్లిస్తూ రచ్చ చేస్తున్నారు. నాగబాబు ఏకంగా వైసీపీ పరిబాషలో అంటూ `నీ అమ్మ మొగుడు` అనే పదాన్ని ఉపయోగించాడు. అసభ్య పదజాలంతో విమర్శలు చేయడంతో దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియోని విడుదల చేశారు. అందులో అసలు తాను అన్న మాటలపై వివరణ ఇచ్చాడు. ఓ సెమినార్‌లో అన్న మాటలు అని, దాని వెనకాల చాలా చర్చ జరిగిందని, చిన్న సినిమాలు అవార్డులకు వెళ్లడం వంటి అంశాలపై చర్చించే క్రమంలో `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ ప్రస్తావన వచ్చిందని చెప్పారు. మూడు గంటల సెమినార్‌ని వదిలేసి ఒక్క నిమిషం క్లిప్‌ని పట్టుకుని నిజాలు తెలుసుకోకుండా దూషించడం సరికాదంటూ కౌంటరిచ్చారు. ఇప్పుడు మరోసారి రియాక్ట్ అయ్యారు తమ్మారెడ్డి. నాగబాబు, రాఘవేంద్రరావులపై ఆయన విరుచుపడ్డారు. తనని దూషించడానికి మీకు సిగ్గు ఉండాలన్నారు. ఓ పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంతగా సిగ్గులేకుండా సంస్కారం లేకుండా మాట్లాడతారా? అన్ని ప్రశ్నించారు. యూట్యూబ్ ఛానెల్ `ఐడ్రీమ్` వేదికగా ఆయన విరుచుకుపడ్డారు.
`వీడికి లెక్కలు తెలుసా అంటున్నారు, ఆ లెక్కలు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీ అకౌంట్లన్నీ నాకు తెలుసన్నారు. మీరు అవార్డుల కోసం, పదవుల కోసం ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో నాకు తెలుసని, ఎవరెవరి చుట్టూ తిరుగారో తెలుసని, అవన్నీ బయటకు చెబితే ఇండస్ట్రీ పరువు పోతుందన్నారు. తనకు అవి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీలాగా బూతులు మాట్లాడటం తనకూ వచ్చని, కానీ మా అమ్మానాన్న సంస్కారం నేర్చించారు, ఎలా మాట్లాడాలో నేర్పించారని, మీకు నేర్పించారా? అని మండి పడ్డారు. తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనని తెలిపారు.అయితే దీనిపై క్లీయర్‌గా వివరణ ఇవ్వాలనుకున్నా. కానీ ఈ పెద్ద మనుషులు మట్లాడాక నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించిందన్నారు. తాను రాజమౌళిపై ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేశానని అంటున్నారని, కానీ తాను ఆయనకు సమకాలీకుడిని కాదు, అసలు ఇప్పుడు సినిమాలు చేయడంలేదు, ఆయనతో పోటీ ఎలా ఫీలవుతాను, రెండు రోజుల క్రితం రాజమౌళిని ప్రశంసిస్తూ పోస్ట్ చేశా, దాన్ని ఎవరూ ఎందుకు చూడలేదు, దానిపై ఎందుకు మాట్లాడటలేదన్నారు.
కొందరు తనని అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైనా నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్న మీకు నన్ను అనే హక్కు ఉందా అని ప్రశ్నించారు. మీరు అనడం వల్ల నేను సెలబ్రిటీ అయ్యానని, నా పేరుతో మీరు సెలబ్రిటీ కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నన్ను తిట్టేవాళ్లు తిడుతుంటారు, కానీ మీరు తిట్టారు చూడండి, మీకు సిగ్గుండాలి. నేనేం సిగ్గుపడక్కర్లేదు. నేనేం తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి. విప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటి. మనమంతా ఒక్కటి అని నేను ఫీలవుతాను. మీకు సిగ్గులేకపోతే, నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
