`ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ కి వెళ్లడంపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు నాగబాబు, మరోవైపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించి కౌంటర్లిచ్చారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు తమ్మారెడ్డి భరద్వాజ.
రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అమెరికాలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంతటి బడ్జెట్ నాకిస్తే నేని ఎనిమిది సినిమా తీసి మొహాన కొడతాను అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నాగబాబు, మరోవైపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించి కౌంటర్లిచ్చారు.
తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు తమ్మారెడ్డి భరద్వాజ. అసలు తానేం అన్నాను, ఏం జరుగుతుంది? ఏం రియాక్ట్ అవుతున్నారనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ వారం రోజుల క్రితం ఓ సెమినార్ జరిగిందని, `నా బంగారుతల్లి` వంటి చిత్రాలను రెండు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ కి సంబంధించిన చర్చ జరిగిందని, ఇందులో ఇరవై మంది స్టూడెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. ఎలా సినిమా తీయాలనేది ప్రశ్నించారని, అందులో తాను వివరిస్తూ సినిమాల్లో రెండు రకాలు ఉంటాయని, రిలీజ్‌కి ముందు పేరొచ్చే సినిమాలు, రిలీజ్ తర్వాత పేరొచ్చే చిత్రాలు, ఇలా అవార్డుల కోసం, రివార్డుల కోసం తీసే రెండు సినిమాలుంటాయని చెప్పారు.
ఇంకా చెబుతూ, ఫెస్టివల్స్ కి వెళ్లడానికి కూడా ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుందని, ఊరికే వెల్లడం సాధ్యం కాదన్నారు. నాలాంటి వాడికి తెలియదు, నంది అవార్డుకి పెట్టడం రాదు, నేషనల్ అవార్డుకి పెట్టడం రాదు, ఆ విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని వారికి చెబుతూ, మాటల్లో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రస్తావన వచ్చిందన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్‌కి వెళితే మనకు రాదా అంటారు, నేను రెగ్యూలర్‌గా ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్తుంటాను. అక్కడ మా సినిమాకి థియేటర్లు ఎందుకివ్వడం లేదని, ఆ సినిమాకి వెయ్యి థియేటర్లిచ్చారు, మా సినిమాకెందుకివ్వరు, మా సినిమాలు ఓటీటీకి కొనడం లేదని నిర్మాతలు వచ్చి అడుగుతుంటారు. ఇంకొక్కరు వచ్చి ఆ సినిమాకి నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. నా సినిమా అంత కంటే బాగుంటుందని చెబుతుంటారు.
ఈ విషయాన్ని ఆ పిల్లలకు వివరిస్తూ, ఆ సినిమా(ఆర్‌ఆర్‌ఆర్)కి ఆస్కార్ వెళ్లడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారని చెబుతూ, ఆ మాటల్లో ఇంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది, దానికి ఆస్కార్‌కి ట్రై చేస్తున్నారని చెప్పాను. అంతటి డబ్బుతో మనం ఎక్కువ సినిమాలు తీయోచ్చు, అంతంత డబ్బులు పెట్టి ట్రై చేస్తున్నారు కాబట్టి, మనం అసలు ట్రై చేయోద్దని చెప్పాను. దీనిపై నేను రెండున్నర గంటలు మాట్లాడాను. కానీ ఒక్క మినిట్ క్లిప్పింగ్ బయటకు వచ్చేసరికి ఎవరు పడితే వాళ్లు రియాక్ట్ అవడం మొదలు పెట్టారు. రియాక్ట్ కావడంలో తప్పులేదు, నిజంగానే బాధ పడి ఉంటే `నువ్వు అనడం తప్పు` అని అనడం కూడా తప్పులేదు. కానీ ఒకరు అకౌంట్లు అడుగుతున్నారు, ఇంకొకరు మరోటి అడుగుతున్నారు. ఇంకొందరు అమ్మ మొగుడిని అంటున్నారు. అది కొంచెం హర్టింగ్‌గా ఉంది. చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంది. నేను వారిలానే రియాక్ట్ కావచ్చు, కానీ నాకు సంస్కారం అడ్డు వస్తుంది. దానిపై నేను రియాక్ట్ కావాలనుకోవడం లేదు.
దీనిపై నేను రియాక్ట్ అయి పెద్దది చేయాలని లేదు. నాకేం ఐడెంటిటీ క్రైసిస్ లేదు. వాళ్లు నన్ను గోల్‌గా చేసుకుని వాళ్ల ఐడెంటిటీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. దీన్ని కొనసాగించాలనుకోవడం లేదు. ఇది జరగడానికి మూడు రోజుల ముందు నేను పోస్ట్ పెట్టాను. భారతదేశం అంతా గర్వించేలా చేస్తున్న రాజమౌళిని అభినందించాలి. ఆస్కార్ అనేది మనకు ఆలోచన లేని విషయం. అలాంటిది మనకు ఇప్పుడు ఆస్కార్ అవార్డునే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సందర్బంగా రాజమౌళిని అభినందిస్తూ పోస్ట్ పెట్టాను. ఆ రోజు ఎవరూ ఇవన్నీ పెట్టలేదే. భలే చెప్పావన్నవాడు ఎవరూ లేరు. నేనేదో సెమినార్‌లో మాట్లాడుతుంటే, దాన్ని తీసుకొని ఇష్యూ చేస్తున్నారు. బూతులు మాట్లాడటం నాకూ వచ్చు. కానీ అవసరం లేదు. కొంచెం సంస్కారంతో పెంచారు మావాల్లు. దాన్ని కోల్పోవడం ఇష్టం లేదు` అని తెలిపారు తమ్మారెడ్డి.
