బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పై బయట చాలా చర్చ జరుగుతోంది. ప్రారంభానికి ముందే ఈ షోపై అనేక వివాదాలు నెలకొన్నాయి. కానీ హోస్ట్ గా మాత్రం నాగార్జు షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం రెండవ వారం ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ 3పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బిగ్ బాస్ 3 ప్రారంభ ఎపిసోడ్ లో నాగార్జున చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగార్జున ఫస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. నాన్న గారు ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా ప్రతి ఆదివారం అందరూ ఇంటికి రావాలని కలసి భోజనం చేయాలని రూల్ పెట్టారు. ఫ్యామిలిలో అందరం ఆదివారం కలుసుకునేవాళ్ళం. కలసి భోజనం చేసేవాళ్ళం అని నాగార్జున తెలిపారు. 

అలాగే బిగ్ బాస్ హౌస్ లో 15 మంది సభ్యులు కూడా కలసి ఉంటారని నాగార్జున తెలిపారు. ఈ వ్యాఖ్యలని తమ్మారెడ్డి తప్పుబట్టారు. బిగ్ బాస్ షోని నాగార్జున నాగేశ్వరరావు గారి ఆలోచనతో పోల్చడం బాధించింది. నాగేశ్వరరావు గారు కుటుంబ విలువలు కోరుకునే మనిషి. ఆప్యాయతలు, అనురాగాలు దూరం కాకూడదని ఆయన ఆ రూల్ పెట్టారు. 

కానీ బిగ్ బాస్ షో ఓ కమర్షియల్ ప్రోగ్రాం.. ఓ గేమ్.. ఇందులో పాల్గొనే సభ్యులంతా డబ్బు కోసం గేమ్ ఆడుతారు. నాగార్జునకి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. బిగ్ బాస్ ని నాగేశ్వరరావు గారి ఆలోచనతో పోల్చే ముందు నాగార్జున ఓ సారి ఆలోచించాల్సింది అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.