మ‌రో సీరియ‌ల్ న‌టుడు ఆత్మ‌హ‌త్య చేసుకొని ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాడు. రంగుల ప్రపంచంలో ఎన్నో ఆశలు పెట్టుకుని, అనుకున్న స్దాయిలో ఆఫర్స్  లేక గ‌త కొన్ని రోజులుగా డిప్రెష‌న్‌లో ఉన్న ఆ న‌టుడు స్నేహితుడి ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. దీంతో సినీ,టీవి ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది.

 తమిళ టెలివిజన్ పరిశ్రమ కు చెందిన ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్  ఆత్మహత్య చేసుకున్నారు.  తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. 

అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్‌ ఆత్మహత్య చేసుకోవటంతో...  అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.

వార్త తెలుసుకున్న పోలీస్ లు ..ఇంద్రకుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పుతున్నారు. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది.