తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య, ఆమె భర్త విశాకన్‌ల పాస్‌పోర్ట్ చోరీకి గురైంది. విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్‌కు వెళ్లారు.

లండన్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌందర్యలకు చెందిన పాస్‌పోర్టులు, రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. దీంతో దంపతులిద్దరూ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపించకపోవడంతో సౌందర్య, విశాకన్‌లను అధికారులు ఎయిర్‌పోర్టులోని విశ్రాంతి గదికి పంపారు. అనంతరం ఈ విషయాన్ని లండన్‌లోని భారతీయ రాయబారులకు, సౌందర్య తండ్రి రజనీకాంత్‌కు తెలియజేశారు.

ఇండియన్ ఎంబసీ అధికారులు తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయడంతో విశాకన్, సౌందర్యలను లండన్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.