‘వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’.. డబ్బింగ్ ఆర్టిస్ట్ మరణంపై తమిళ స్టార్ సూర్య భావోద్వేగం!
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి (Srinivasa Murthy) మరణంపై తమిళ స్టార్ హీరో సూర్య స్పందించారు. ఆయన తుదిశ్వాస విడవటం తనకు వ్యక్తిగతంగా తీరని లోటంటూ భావోద్వేగం అయ్యారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ప్రముఖులను కోల్పోతుండటంతో సినీ తారలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్ జమున మరణ వార్తతో చిత్రసీమ విషాదంలో కూరుకుపోయింది.. ఈ తరుణంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణం మరో షాక్ కు గురిచేసింది. గుండెపోటు రావడంతో ఈరోజు (శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అభిమానులు, సినీ స్టార్స్ కూడా ఆయనను కోల్పోవడం పట్ల ఎమోషనల్ అవుతున్నారు.
తమిళ స్టార్ సూర్య (Suriya) కూడా తాజాగా స్పందించారు. శ్రీనివాస మూర్తి మరణంపై భావోద్వేగమయ్యారు. ఆయనను ఇంత త్వరగా కోల్పోవడం తన జీవితంలో పెద్ద నష్టమేనని భావించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ నివాళి అర్పించారు. సూర్య ట్వీట్ చేస్తూ.. ‘ఆయన మరణం వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి గాత్రం మరియు భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నాను సర్! ఇంత త్వరగా వెళ్లిపోవడం బాధాకరం’ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
తమిళంలోని సూర్య నటించిన చిత్రాలకు శ్రీనివాస మూర్తి వాయిస్ అందించారు. ‘సింగం’ సిరీస్ లలో సూర్య నటకు ఆయన గాత్రం తోడై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లు దద్దలిల్లాయి. సూర్యతో పాటు చియాన్ విక్రమ్, అజిత్, మోహన్ లాల్, వంటి హీరోలను ఆయన వాయిస్ అందించారు. ఎన్నో ఏళ్ల నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస్ ఇండస్ట్రీలో రాణించారు.