తెలుగు ఆడియన్స్ పై ప్రేమను కురిపించాడు తమిళ స్టార్ హీరో సూర్య. మీరు బెస్ట్ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సూర్య ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడు. 

 తమిళ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్ మోస్ట్ సూర్య తమిళ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతాయి, అందులో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈమధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలన్నీ అకేషన్ ప్రకారం రీ రిలీజ్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు మేకర్స్.. తమ ఖాతాలు నింపుకుంటూ.. ఫ్యాన్స్ కు కనుల విందు అందిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అప్పుడు ప్లాప్అయినా..హిట్ అయినా.. ఇప్పుడు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రీరిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి. 

అందు భాగంగా సూర్య నటించి తమిళ సినిమా.. తెలుగులో డబ్ అయ్యి మంచి విజయం సాధించినటువంటి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తెలుగులో రీ రిలీజ్ అయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ 2008లో తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య, సిమ్రాన్, సమీరా రెడ్డి నటించారు. సూర్య డబల్ రోల్ ప్లే చేశారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ చాలా మందికి ఫేవరేట్. తాజాగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని తెలుగులో రీ రిలీజ్ చేయగా అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తారు.

ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో సాంగ్స్ కి కేరింతలు కొట్టారు ఆడియన్స్. మన తెలుగు స్టార్ హీరోల రీరిలీజ్ లకు సమానంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ కి రెస్పాండ్ వచ్చింది. థియేటర్స్ లో తెలుగు ఫ్యాన్స్ చేసిన సందడి చూసి సూర్య ఆశ్చర్యపోయి దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసి.. ఈ ప్రేమ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని ఎంజాయ్ చేయడంలో మీరు బెస్ట్ అని ట్వీట్ చేశారు. 

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తమిళ హీరోలకు తెలుగులో కూడా మార్కెట్ గట్టిగా పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు సినిమాలు వెళ్తుండటంతో తమిళ హీరోలు వారికి తెలుగులో ఉన్న మార్కెట్ ను ఉపయోగించుకుంటున్నారు. తెలుగు నుంచి డైరెక్ట్ సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే విజయ్, ధనుష్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అటు సూర్య కూడా త్వరలో తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తారని సమాచారం. సూర్య తమ్ముడు కార్తి ఊపిరి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.