'ఉస్తాద్' లో విలన్‌గా అదిరిపోయే నటుడు, హరీశ్ శంకర్ మామూలోడు కాదుగా!
ఉస్తాద్ భగత్ సింగ్‌లో అలా వచ్చి వెళ్లిపోయే పాత్రకాదని ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ అని తెలిసింది. హరీశ్ శంకర్ ఆయన పాత్రను కొత్తగా డిజైన్ చేశారట.

పవన్ కళ్యాణ్ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న #UstaadBhagatSingh మిని షెడ్యూల్ లో పవన్ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సీన్స్ తీయనున్నారు. ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీస్తారు. ఈ సినిమా పై అభిమానులు ఓ రేంజిలో ఆశలు పెట్టుకున్నారు.మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ కావటంతో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా మాస్ క్యారెక్టర్‌లో చూపిస్తారని ఆశిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ ఎదుర్కోబోయే విలన్ కూడా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. అఫీషియల్ గా చిత్రం టీమ్ కూడా ఎటువంటి హింట్ ఇవ్వకపోయినా విలన్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారో దాదాపు ఖరారు అయినట్లుగా సమాచారం. గబ్బర్ సింగ్ కోసం అభిమన్యు సింగ్‌ను తీసుకొచ్చిన హరీశ్ శంకర్. ఈ సారి కూడా ఉస్తాద్ కోసం మరొకరని తెలుగుకు తీసుకున్నారట.
ఆయన మరెవరో కాదు తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్ పార్తీబన్. ఆయన్ను విలన్ పాత్రలో డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో పార్ధీపన్ దర్శకుడిగా, నటుడిగా మూడు దశాబ్దాల నుంచి కెరీర్లో రాణిస్తున్నారు. అయితే తెలుగులో ఈయన చేసినవి తక్కువే. అప్పట్లో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో రామ్‌చరణ్ ఫాదర్‌గా చేసిన సూర్యనారాయణే ఈయనే. అలాగే కార్తీ యుగానికొక్కడు సినిమాలో చోళరాజు గా కనిపించి ఇక్కడవారికి గుర్తుండిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్‌లో అలా వచ్చి వెళ్లిపోయే పాత్రకాదని ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ అని తెలిసింది. హరీశ్ శంకర్ ఆయన పాత్రను కొత్తగా డిజైన్ చేశారట. రీసెంట్ గా ఆయన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లోనూ ఓ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.ఇకపోతే గతంలో ఓ సారి ఉస్తాద్‌లో విలన్ పాత్ర కోసం హరీష్ తనను అడిగారంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఓ సందర్భంలో చెప్పారు.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం.. దళపతి విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘తెరి’కి రీమేక్ అని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు హరీశ్‌ను క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపడలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రైటర్‌గా మారిన డైరెక్టర్ దశరథ్ స్పందిస్తూ.. ‘‘‘తెరి’ సినిమా స్టోరీ లైన్‌ను మాత్రమే తీసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చేస్తున్నారు హరీష్ శంకర్. పది శాతం కథను మాత్రమే తీసుకున్నాం. మిగతా తొంబై శాతం సినిమా కథను హరీష్ తనదైన స్టైల్లో మార్చేశారు. రీసెంట్‌గా వచ్చిన టీజర్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది’’ అన్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రీలీల కనిపించనుంది. మరో హీరోయిన్‌గా అఖిల్ సరసన ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య కనిపించనుంది. పోలీస్ డ్రామాగా సినిమా రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.