సీనియర్ నటుడు, కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాకెట్ రామనాథన్(74) అనారోగ్యంతో మరణించారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళంలో చాలా మంది తారలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు రామనాథన్.

నామ్, మన్ సోరు, స్పరసం వంటి సినిమాల్లో నటించి నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను నడిగర్ సంఘం నుండి కలచ్చ సెల్వం, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డుని దక్కించుకున్నారు.

ఈయనకు భార్య భానుమతి, కొడుకు గురు బాలాజీ, కూతురు సాయిబాల ఉన్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామనాథన్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.