హాస్యనటుడు తవసి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. స్టేజ్ 4 క్యాన్సర్ తో బాధపడుతున్న తవసి ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. కొంత కాలంగా ఆయనకు పైపు ద్వారా పండ్ల రసాలు ఆహారంగా ఇస్తున్నారు. వ్యాధి కారణంగా తవసి గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఆయన ఎముకల గూడులా తయారయ్యారు. ఏళ్లుగా తన కామెడీతో తమిళ ప్రేక్షకులకు నవ్వులు పంచిన తవసి దీనస్థితిని డీఎమ్ కే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

ఓ ఛారిటబుల్ ట్రస్ట్ అతని వైద్య ఖర్చులు భరిస్తుందని శరవణన్ తెలియజేశారు. అలాగే ఆయన కుటుంబాన్ని ఆర్థికం ఆదుకోవడానికి ప్రేక్షకులు, పరిశ్రమ ముందుకు రావాలని వీడియో ద్వారా తెలియజేశారు. తవసి పరిస్థితి తెలుసుకున్న చిత్ర ప్రముఖులు ముందుకు వచ్చారు. హీరో శివ కార్తికేయన్ తన అభిమాన సంఘం తరపున రూ. 25 వేలు విరాళంగా ఇచ్చారు. 

మరో హీరో విజయ్ సేతుపతి తన మిత్రుడుతో కలిసి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. మరికొందరు చిత్ర ప్రముఖులు తవసి కి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. సువరా పాండియన్, రజినీ మురుగన్ మరియు వరుతాపాద వాలిబార్ సంగం వంటి చిత్రాలలో తవసి నటించడం జరిగింది.