మిల్కీ బ్యూటీ తమన్నా నాలుగు రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ముంబయిలోని తన ఇంటికి చేరారు. తాజాగా తనని త్వరగా కోలుకునేలా చేసిన ఆసుపత్రి వర్గాలకు తమన్నా థ్యాంక్స్ చెప్పింది. 

సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. స్వయంగా వారికి ధన్యవాదాలు చెబుతూ దిగిన ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా స్పందిస్తూ, నేను కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేసిన కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సిబ్బంది, నర్సులు, డాక్టర్లు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. వారి కృషిని వర్ణించేందుకు పదాలు రావడం లేదు. కరోనాకి గురైనప్పుడు నేను చాలా ఆనారోగ్యంతో ఉన్నాను. చాలా బలహీనంగానూ ఉన్నా. దీంతో చాలా భయపడ్డాను. కానీ నా భయాన్ని పోగొట్టి, నాలో ధైర్యాన్ని నింపి, నాకు సౌకర్యవంతంగా ఉండేలా చేసి, మంచి ట్రీట్‌మెంట్‌ అందించి త్వరగా కోలుకునేలా చేసిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సిన్సియర్‌గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా` అని తెలిపింది.

తమన్నా పోస్ట్ కి కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సీఇఓ డాక్టర్‌ రాహుల్‌ మెడక్కర్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, `మా హాస్పిటల్‌ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ప్రశంసలు మా బృందం మరింత బాగా కష్టపడేలా, మంచి సర్వీస్‌ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తుంటుంది. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొనేలా చేస్తుంది, ప్రజల అంచనాలను ఆందుకునేలా చేస్తుంద`ని అన్నారు.

తమన్నా ఆసుపత్రి సిబ్బందిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలపగా, ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ వ్యవస్థాపకుడు గురు ఎన్‌ రెడ్డి, సీఇవో రాహుల్‌ మెదక్కర్‌ తదితరులు పాల్గొన్నారు.