టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటుతున్నా అవకాశాలు మాత్రం ఎంతమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె నటించిన 'అభినేత్రి 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే బాలీవుడ్ లో ఆమె నటించిన 'ఖామోషి' సినిమా విడుదల కానుంది.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈ బ్యూటీ సినిమా విషయాలతో పాటు తన పెళ్లి, రాజకీయాల గురించి మాట్లాడింది. తను ఓ హీరోతో ప్రేమలో ఉందని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆమె అసలు ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తారో అర్ధం కాదని, వాటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుందని చెప్పింది.

పెళ్లి గురించి మాట్లాడుతూ.. మంచి పెళ్లికొడుకు దొరికితే చేసుకుంటానని చెప్పింది. దర్శకుడు విజయ్ కూడా మంచి అబ్బాయి ఉంటే చూడమని చెప్పానని, మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతడిని పెళ్లాడతానని చెప్పుకొచ్చింది. రాజకీయాలపై ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

చాలా మంది హీరోయిన్లు పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు కదా.. మీకు అలాంటి ఆలోచన ఉందా..? అని ఆమెని ప్రశ్నిస్తే.. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని చెప్పింది. తనకు రాజకీయాలు తెలియవని, కానీ మరో ఐదేళ్లలో రాజకీయాల గురించి నేర్చుకొని ఆ దిశగా పయనిస్తానేమోనని షాక్ ఇచ్చింది.