సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన సీనియర్ నటి టబు మళ్ళీ చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకుంది. గత కొన్నాళ్లుగా ఆమెకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా చేయడానికి ఒప్పుకోలేదు. టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగిందని అనుకుంటుందో ఏమో తెలియదు గాని గత ఏడాది నుంచి తెలుగు దర్శకులు కథ చెప్పడానికి వస్తే ఏ మాత్రం టబు నో చెప్పడం లేదు. 

కానీ ఇటీవల ఒప్పుకున్న ఒక సినిమా చేయనని చెప్పి నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు టాక్. రానా - సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకున్నా టబు మరికొన్ని రోజుల్లో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఊహించని విధంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు చిత్ర యూనిట్ కి సమాచారం అందించిందట. 

డేట్స్ కుదరకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న టబు తెలుగులో త్రివిక్రమ్ - బన్నీ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే రెండు బాలీవుడ్ సినిమాల షూటింగ్ సమయాల్లోనే విరాటపర్వం షెడ్యూల్ సెట్టవ్వడంతో సమయం అస్సలు కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల నేషనల్ అవార్డ్ విన్నర్ నందితా దాస్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.