విక్టరీ వెంకటేష్, టబు జంటగా నటించిన చిత్రం కూలీ నెం 1. టబుకు తెలుగులో ఇదే తొలి చిత్రం. 1991లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కూలీ నెం 1 చిత్రం విజయం సాధించడంతో టబుకు అప్పట్లో బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత వెంకీ, టబు కలసి మరో చిత్రంలో నటించలేదు. ఈ సూపర్ హిట్ జోడీని మరోమారు వెండి తెరపై చూసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించేందుకు సురేష్ బాబు రెడీ అవుతున్నారు. హిందీలో నటించిన టబునే హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. టబుని దే దే ప్యార్ దే రీమేక్ కోసం ఇటీవల సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి నటించబోతున్నట్లు అవుతుంది. 

వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే దే దే ప్యార్ దే రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలో ఏ హీరోయిన్ ని తీసుకుంటారనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు, ఇతర నటీనటుల గురించి కూడా త్వరలో వివరాలు ప్రకటిస్తారు.