ఒక్కోసారి మన తారలు తమ పాత్రల్లో లీనమైపోవడం వలన నిజజీవితంలో కూడా అలానే ప్రవర్తిస్తూ రీల్ లైఫ్ క్యారెక్టర్ నుండి పూర్తిగా బయటపడలేకపోతారు. హీరోయిన్ తాప్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.

ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాప్సీ హీరోయిన్ గా 'మన్మర్జియా' అనే సినిమాలో నటించింది. గత ఏడాదిలో విడుదలైన ఈ సినిమాలో తాప్సీ చాలా గంభీరంగా నటించింది. ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే కొట్టిపడేస్తుంది.

అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తాప్సి  తన సోదరితో కలిసి బయటకి వెళ్లిందట. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రహస్యంగా తాప్సి ఫోటోలు తీశాడట. అది గమనించిన తాప్సి కోపంగా అతని వద్దకు వెళ్లి ఫోన్ లోపల పెడతావా..? లేక పగలగొట్టనా..? అని బెదిరించిందట.

దీంతో ఆ ఫోటోలు తీసిన వ్యక్తి అక్కడ నుండి పారిపోయాడట. తాప్సి సోదరి మాత్రం భయపడి తనకు ఏమీ తెలియనట్లుగా ఉండిపోయిందట. ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పుకొచ్చింది తాప్సి. 'బద్లా' సినిమాలో నటిస్తోన్న సమయంలో తాప్సి సోదరి భయపడేవారట. ఆ సినిమాలో మాదిరి నిజజీవితంలో కూడా ఎవరినైనా చంపేస్తానేమోనని  తన సోదరి భయపడిందని తాప్సి చెప్పుకొచ్చింది.