తను పబ్లిక్ ఫిగర్ కావడంతో ఏదైనా మాల్ కి వెళ్లి బట్టలు కొనడం అంటే కష్టమని అంటోంది హీరోయిన్ తాప్సీ. తను సెలబ్రిటీ కావడంతో ఏదైనా మాల్ కి వెళ్లి షాపింగ్ చేయాలంటే తెగ ఇబ్బంది పడాల్సి ఉంటుందని.. జనాలంతా చుట్టుముడతారని తాప్సీ చెప్పుకొచ్చింది. 

అందుకే చాలా కాలంగా తను ఇండియాలో షాపింగ్ చేయడం లేదని.. తన షాపింగ్ మొత్తం విదేశాల్లోనే సాగుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే మాల్స్ కి వెళ్లి కొత్త కొత్త బట్టలు, ఇతర అవసరమైనవి కొనడం అంటే తనకు ఎంతో ఆసక్తి అని కానీ అది కుదరడం లేదని తెలిపింది.

ఆ కారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు బ్రాండెడ్ దుస్తులు షాపింగ్ చేస్తానని.. కానీ బ్రాండెడ్ బట్టల కోసం విదేశాలకు వెళ్లనని చెప్పింది. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం వలన కొన్నిసార్లు ఇబ్బంది తప్పడం లేదని ఆమె అన్నారు.

ప్రేక్షకులు అభిమానించాలనే సినిమాలు చేస్తానని.. నటిగా కష్టపడతానని.. వాళ్లు చూపించే ప్రేమంటే తనకు కూడా ఇష్టమేనని.. కానీ కొన్ని సార్లు అభిమానం అనే గీత దాటి ప్రవర్తిస్తారని.. దాంతో తనతో పాటు వచ్చే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది.

అందువలనే ఇంతకుముందులా రోడ్డు మీద తిరగలేకపోతున్నానని.. స్నేహితులతో కలిసి బయటకి వెళ్లలేకపోతున్నానని అన్నారు. ఇటీవల 'మిషన్ మంగళ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది ఈ బ్యూటీ.