ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. బదాయూ జిల్లాలో యాభై ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచారం జరిగింది. ఈ ఘటనకి సంబంధించిన బాధితురాలి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సిడబ్ల్యూ) సభ్యురాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు చంద్రముఖి మహిళలు, వారి కదలికలపై చేసిన అసంబద్ద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

రాత్రి పూట ఆ మహిళ ఒంటరిగా బయటకి వెళ్లి ఉండకపోతే అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వెంట ఎవరైనా తోడు వెళ్లాల్సి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని వ్యాఖ్యానిచ్చారు. అంతేకాదు వేళగాని వేళ మహిళలు బయటికి రాకూడదని ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో ఇది పెద్ద దుమారం రేపుతుంది. ఓ బాధ్యతగల మహిళా, మహిళా స్వేచ్ఛ కోసం పోరాడే ఓ మహిళ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 

దీనిపై రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. నటి తాప్సి స్పందిస్తూ ఇలాంటి రకమైన ఆలోచన ఉన్నవారు ఈ దేశంలో లేకపోతే ఇలాంటి  ఘటనలు జరగవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరితోపాటు అనేక మంది బాలీవుడ్‌ ప్రముఖులు స్పందించి చంద్రముఖి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దీనిపై ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌ రేఖ శర్మ స్పందించారు. ఆమె అలా ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ, మహిళలు ఎక్కడ ఎలా ఉండాలో వారిష్టం అని, చంద్రముఖి వ్యాఖ్యలను ఖండించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది అని పేర్కొన్నారు.  అటు మహిళా సంఘాలతోపాటు పలువురు మండిపడుతున్నారు. 

ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం మహిళ ఆలయానికి వెళ్లినప్పుడు స్వయంగా పూజారి, మరో ఇద్దరితో కలిసి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతోపాటు దారుణంగా హింసించారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిని, పక్కటెముకలు, కాలు విరిగిపోయి చనిపోయారు. ఈ ఘటన సంబంధించి ఆలయ పూజారి, అతడి ఇద్దరు సహచరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు ఆలయ పూజారిని ఇంకా  పరారీలో ఉన్నాడని సమాచారం.