గత రెండుమూడు రోజులుగా హీరోయిన్‌ తాప్సీ, దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌లతోపాటు పలు నిర్మాణ సంస్థలు, ఇతర ఫిల్మ్‌ మేకర్స్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం బాలీవుడ్‌లో దుమారం రేపుతుంది. ఇందులో కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్టుగా ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. 

అయితే తాజాగా దీనిపై తాప్సీ ప్రియుడు స్పందించారు. ఆయన భారత క్రీడాకారులకు కోచ్‌గా ఉన్న తాప్సీ ప్రియుడు మాథియాస్‌ బో ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. `నాలో కొంచెం గందరగోళాన్ని కనుగొన్నాను. కొంత మంది గొప్ప అథ్లెట్లకి కోచ్‌గా ఇండియన్‌ క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో వారి కుటుంబంలో అనవసరమైన ఒత్తిడి నెలకొంది. దీనిపై ఏదైనా చేయండి ప్లీజ్‌` అంటూ కేంద్రమంత్రికి ట్వీట్‌ చేశారు తాప్సీ ఫ్రెండ్‌. 

దీనిపై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిస్పందించారు. `ఈ భూమిపై చట్టం అత్యున్నతమైనది. మేం దానికి కట్టుబడి ఉండాలి. ఈ విషయం మీ, నా పరిధి మించినది. భారతీయ క్రీడల ప్రయోజనార్థం మేం మా వృతి పరమైన విధులకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి` అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు మరింతగా హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై రైతు పోరాటం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ఛార్జీలు పెరగడంపై తాప్సీ, అనురాగ్‌ వంటి వారు గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరుని నిరసించారు. దీని కారణంగానే వీరిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయనే కామెంట్‌ బాలీవుడ్‌ నుంచి వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలోనూ దీనిపై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతుంది. 

ఐటీ అధికారులు బుధవారం తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌, అతని పార్టనర్‌ ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించారు. అలాగే ఫాంటమ్‌ ఫిల్స్మ్  సంస్థపై కూడా దాడులు జరిగాయి. మొత్తంగా 28 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ సీఈఓ శిభాసిష్‌ సర్కార్‌ కూడా ఉండటం విశేషం. అలాగే వికాస్‌ భల్‌, మధుమంతెన ఇంట్లోనూ అంతకు ముందు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ దాడులపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్ష్య సాధింపు చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఈ మేరకు ఆయన `మోడీరైడ్స్ ప్రో ఫార్మర్స్` అనే యాష్‌ ట్యాగ్‌ని జత చేశారు.