పవన్ కళ్యాణ్, శ్రవణ్ కుమార్ మధ్య స్నేహం పీఆర్పీ టైంలో మరింతగా బలపడింది. పవన్, శ్రవణ్ కలసి పలు ప్రాంతాల్లో పీఆర్పీ కోసం ప్రచారం చేశారు.
స్టైల్, యాటిట్యూడ్, వ్యక్తిత్వం.. ఆ అంశాలు క్రేజ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ కొనసాగుతూ వచ్చింది. రాజకీయాల్లో పవన్ కు ఎలాంటి ఫలితాలు ఎదురైనప్పటికీ అభిమానులు ఆయనపై చూపించే ప్రేమ మాత్రం తగ్గదు. ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన పవన్.. వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా మరోవైపు పవన్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. తండ్రిలాగే అకీరాకు కూడా మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ ఏర్పడినట్లు ఉంది. అకీరా కర్రసాములో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అకీరా కర్ర తిప్పుతుంటే ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ తో మోత మోగించారు. అప్పుడే అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అంటూ చర్చ మొదలైపోయింది. ఈ వీడియోపై సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తాజాగా అకీరా వీడియోపై కామెంట్స్ చేశారు. అకీరాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. దాసోజు శ్రవణ్ కుమార్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ లో కీలక నేత. పవన్, శ్రవణ్ కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రజారాజ్యం పార్టీ కన్నా ముందు నుంచే వీరిద్దరి స్నేహం మొదలయింది.
శ్రవణ్ కుమార్ అకీరా వీడియోపై స్పందిస్తూ.. 'అకీరా నందన్.. నీకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు 2007లో తొలిసారి నిన్ను చూశాను. నిన్ను ముద్దు చేసిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పొడవైన వ్యక్తిగా, అందగాడిగా మారావు. నీకిక ఆకాశమే హద్దు. లైక్ ఫాదర్.. లైక్ సన్.. గాడ్ బ్లెస్ యు' అని శ్రవణ్ కుమార్ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్, శ్రవణ్ కుమార్ మధ్య స్నేహం పీఆర్పీ టైంలో మరింతగా బలపడింది. పవన్, శ్రవణ్ కలసి పలు ప్రాంతాల్లో పీఆర్పీ కోసం ప్రచారం చేశారు. ఆదిలాబాద్ లో ఆదివాసీల తండాలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు.. అక్కడ వారి నీటి సమస్య చూసి పవన్ చలించిపోయారని.. వారి కోసం పవన్ స్వయంగా రెండు బోర్లు వేయించారని శ్రవణ్ కుమార్ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు.
