ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రం తెరకెక్కింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా నరసింహారెడ్డి చరిత్రని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లందుకు సైరా టీం నడుం బింగించింది. 

తాము అమర్ చిత్ర కథ సంస్థతో చేతులు కలిపినట్లు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తాజాగా ప్రకటించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని పుస్తక రూపంలోకి తీసుకురానున్నారు. అమర్ చిత్ర కథ సంస్థ ఎన్నో దశాబ్దాలుగా భారతీయ పురాణాలు, చరిత్ర, జానపద కథలని బొమ్మల రూపంలో అందిస్తోంది. 

అమర్ చిత్రకథ పుస్తకాలకు మంచి ఆదరణ ఉంది. అమర్ చిత్ర కథ సంస్థ నుంచి వచ్చిన పుస్తకాలు ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. బొమ్మల రూపంలో కథలు అందిస్తున్నారు కాబట్టి చిన్న పిల్లలలో వీటికి ఎక్కువగా ఆదరణ ఉంది. 

అమర్ చిత్ర కథ సంస్థ ఉయ్యాలవాడ జీవిత చరిత్రని 'నరసింహారెడ్డి - ది లయన్ ఆఫ్ రాయలసీమ' అనే టైటిల్ తో పుస్తకాలు ముద్రించనుంది. దీనికి సంబంధించిన కవర్ పేజీని విడుదల చేశారు. చిన్నపిల్లలకు నరసింహారెడ్డి చరిత్ర చేరువైతే ఇక రాబోయే తరాలు అయన వీరత్వం, దేశభక్తి గురించి తెలుసుకుంటారనడంలో సందేహం లేదు.