సినిమా ఇండస్ట్రీలో ఒక కథ పుట్టగానే మినిమమ్ ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరకు వెళ్లకుండా ఉండదు. ఈ రోజుల్లో చాలా వరకు కథలు సింగిల్ సిట్టింగ్ లో ఓకె అవ్వడం లేదు. అగ్ర దర్శకులు అయినా కూడా కొందరు హీరోలు అన్ని అలోచించి గాని సినిమా చేయడం లేదు. అయితే గతంలో సైరా నరసింహారెడ్డి కథ కూడా అనేక కాంపౌడ్లు టచ్ చేసి వచ్చిందట.  

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా ప్రస్తుతం సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కథను 20 ఏళ్ల క్రితమే సిద్ధం చేసుకున్న పరుచూరి బ్రదర్స్ అప్పట్లో కొంతమంది హీరోలను కలిశారట. 

టాలీవుడ్ లో 35 కోట్ల బిజినెస్ కూడా కరెక్ట్ గా లేని సమయంలోనే అప్పుడు సైరాకు 50 కోట్లవరకు బడ్జెట్ అవసరం పడింది. ఇక బాలకృష్ణతో చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్మాత ఎమ్ఎస్.రెడ్డి ప్రొడక్షన్ లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించేలా ప్లాన్స్ జరిగాయి. కానీ ఆ సమయంలో బాలయ్య అశ్వమేధం-శ్రీ కృష్ణార్జున విజయం-నిప్పు రవ్వ లాంటి హై బడ్జెట్ మూవీస్ వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి. 

దీంతో 50కోట్ల రిస్క్ ఎందుకని డ్రాప్ అయ్యారు. ఇక ఆ తరువాత వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవితో చేయాలనీ మళ్ళీ సైరా చర్చలు మొదలయ్యాయి. కానీ మెగాస్టార్ కూడా రిస్క్ గా భావించారు. ఓవర్సీస్ లో కూడా సినిమాను రిలీజ్ చేయడమంటే కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది అని డ్రాప్ అయ్యారు. 

ఇక ఇన్నేళ్లకు బాహుబలి లాంటి సినిమా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలకు ఒక దారి చూపించినట్లు హిట్టవ్వడంతో సైరా కూడా ఊపందుకుంది. రామ్ చరణ్ ఏ మాత్రం రాజి పడకుండా 200 కోట్లవరకు సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడు. వీలైనంత వరకు నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నాడు.